మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 16 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్, లక్ష్మిరెడ్డి, మరో 13 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి రవినాయక్ వీరి నుంచి పత్రాలు స్వీకరించారు.
ఈ నెల 14 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఈ నెల 28న పోలింగ్ జరుగనుంది. ఏప్రిల్ 2న కౌంటింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,439 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో ఇద్దరు ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 888 మంది ఎంపీటీసీలు, 83 మంది జెడ్పీటీసీలు, 449 మంది కౌన్సిలర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
ఈనెల 28న ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్‌నగర్‌లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న నారాయణరెడ్డి కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలవడంతో ఉపఎన్నిక నిర్వహిస్తున్నారు.