ఒంటిపూట బడులు.. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన

0
10

టెన్త్ పరీక్షలు జరిగే 2,676 స్కూళ్లలో ఒంటిపూట బడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. మిగతా అన్ని స్కూళ్లలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు క్లాసులు నిర్వహిస్తారు.

అటు ఏప్రిల్ 23తో ఈ విద్యా సంవత్సరం ముగియనుండగా.. ఆ తర్వాత వేసవి సెలవులు ఉండొచ్చు. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. . రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలకు ఈ నిబంధన వర్తిస్తుంది. విద్యార్థులకు 12.30 గంటలకు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంటుంది.

మరోవైపు రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లూ చేసినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులకు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి.

ఈ సారి సైన్స్‌ పరీక్షను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. పార్ట్‌–1లో ఫిజికల్‌ సైన్స్‌, పార్ట్‌–2లో బయాలజీ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు మాత్రం ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు జరగనున్నాయి.