గతేడాది టెన్త్ ప్రశ్నపత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో ఈసారి SSC బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. పరీక్షాకేంద్రాలను ‘నో సెల్‌ఫోన్’ జోన్లుగా ప్రకటించింది. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్‌ఫోన్లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్‌చేస్తారు. పేపర్ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు.
మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు దాదాపు 5.08 లక్షల మంది విద్యార్థలు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షాకేంద్రాలను ఏర్పా టు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే 040 -23230942 నంబర్‌ను సంప్రదించవచ్చు.
షెడ్యూలు ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.