ఎన్నాళ్లకెన్నాళ్లకు..! తెలంగాణకు రక్షణ శాఖ భూములు అప్పగింత

0
24

హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య, రోడ్ల విస్తరణ పనుల్లో కేంద్రం నుంచి పనులు చేయించుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి చూపిన చొరవ వర్కవుట్ అవుతోంది. రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వానికి 175 ఎకరాల భూమినిబదిలీ చేసింది. ఈ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనల పట్ల సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ… భూముల బదిలీకి అనుకూలంగా అనుమతులను ఇచ్చింది.

డిసెంబర్ 7న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలంగాణ సీఎం కార్యాలయం తెలిపింది. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రక్షణ శాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రేవంత్ కోరడంతో కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని చెప్పింది. తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు.

తెలంగాణకు ఈ భూములను కేటాయించడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్, రామగుండంలను కలుపుతూ నిర్మించే రాజీవ్ రహదారి కోసం 11.3 కిలోమీటర్ల పొడవున ఎలివేటెడ్ కారిడార్ కోసం భూసేకరణ చేయాల్సి ఉందని చెప్పారు. ఇందులో కొంత భూమి రక్షణ శాఖ పరిధిలో ఉందని… కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ సమస్యకు పరిష్కారం దొరికిందని అన్నారు. మోదీకి, రాజ్ నాథ్ సింగ్ కు ధన్యవాదాలు తెలిపారు.