దంచుతున్న ఎండలు.. ఎల్‌ నినో ప్రభావంతో సూర్యుడి మంట

0
15

ఈసారి ఎండాకాలం కరోనా ముందు రోజులను గుర్తుచేస్తాయట. మార్చి నెల మొదట్లోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న సమయంలో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. మార్చి 8వ తేదీన అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. గతేడాది ఇదే రోజుతో పోలిస్తే ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అయ్యినట్లు అధికారులు చెప్పారు. ఏపీలోని పశ్చిమ, దక్షిణ రాయలసీమ ప్రాంతాలు, పశ్చిమ తెలంగాణల్లో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మార్చి నుంచి మే వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే నమోదు అవుతాయని చెబుతున్నారు అధికారులు. వేడి తీవ్రత గతేడాది కంటే ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.

ఎల్‌-నినో ప్రభావంతో ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండే చాన్సులు ఉన్నాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఎల్‌-నినో ప్రభావం జులై నుంచి కొనసాగుతోంది. వర్షాకలంలో కూడా వానలు సరిగ్గా పడలేదు. 2023 ఆగస్టులో వందేళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితులు నెలకొన్నాయి. గత జనవరిలో కూడా వర్షాలు పడలేదు. మార్చి నుంచి మే వరకు తమిళనాడు, జమ్ముకశ్మీర్ మినహా అన్ని ప్రాంతాల్లో హీట్‌ వేవ్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.