ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వెళ్తున్న జగన్ మేనిఫేస్టో ప్రకటించడానికి సిద్దమవుతున్నారు. మార్చి 10న మేనిఫేస్టో ప్రకటించనున్నారు. బాపట్ల జిల్లాలోని మేదరమిట్ల దగ్గర సిద్ధం సభలో మేనిఫేస్టో రిలీజ్ చేయనున్నట్లు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి వెల్లడించారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో దాదాపు అన్ని హామీలు అమలు చేసామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ సారి ప్రధానంగా లక్ష రూపాల రైతురుణ మాఫీ పైన ప్రకటన ఉంటుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో పాటుగా డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం, పెన్షన్ రూ 3 వేల నుంచి రూ 4 వేలకు పెంపు, అమ్మఒడి ఇద్దరు పిల్లలకు వర్తించేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు.
సీఎం జగన్ జిల్లాల వారీగా ఎన్నికల ప్రచారానికి హాజరయ్యేలా షెడ్యూల్ సిద్దం అవుతోంది. 10న జరగబోయే నాలుగో సిద్దం సభ తొలి మూడు సభలను అధిగమించేలా ఉంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు.