తెలంగాణ రాజకీయాల్లో మరో ఇంట్రస్టింగ్ సీన్ రాబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. అయితే ఆయన వచ్చినప్పుడు అవసరమైన ప్రోటోకాల్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాటిస్తారని ఆశిస్తున్నట్లు కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి కిషన్‌రెడ్డి చెప్పారు. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కిషన్ రెడ్డి ఈ కామెంట్స్ చేయడం విశేషం.
పీఎం మోదీ మార్చి 4-5 తేదీల్లో రాష్ట్రంలో పర్యటిస్తారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ బహిరంగ సభలలలో పాల్గొంటారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మార్చి 4న ఆదిలాబాద్‌లో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మార్చి 5న సంగారెడ్డిలో ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్త వాటికి శంకుస్థాపనలు, బహిరంగ సభలో మాట్లాడతారు.
ప్రొటోకాల్ ప్రకారం సీఎం సహా ప్రముఖులకు ఆహ్వానాలు పంపామన్నారు కిషన్ రెడ్డి. సంప్రదాయం ప్రకారం రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి.. ప్రధానమంత్రిని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారని భావిస్తున్నానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఈ సంప్రదాయాన్ని పాటించలేదని.. రేవంత్‌రెడ్డి ప్రోటోకాల్‌ను అనుసరించి ప్రధానిని వ్యక్తిగతంగా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు.