రేవంత్ సీఎం కావడం మన ఖర్మ..దౌర్భాగ్యం..ట్విట్టర్లో కేటీఆర్ ఫైర్

0
20

సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ సోయి లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం దౌర్భాగ్యమన్నారు. రేవంత్ కు తెలంగాణ ఆత్మ లేదని.. తెలంగాణపై గౌరవం అంతకన్నా లేదన్నారు. అందుకే తెలంగాణ ఆత్మగౌరవంపై మోడీ సాక్షిగా రేవంత్ దాడి చేశారని విమర్శించారు. రేవంత్ సీఎం కావడం మన ఖర్మ అంటూ ధ్వజమెత్తారు. రేవంత్ ను చరిత్ర క్షమించదంటూ ట్వీట్ చేశారు కేటీఆర్.

తెలంగాణ మోడల్ అంటే సమున్నత సంక్షేమ నమూనా .. సమగ్ర అభివృద్ధికి చిరునామా అని కేటీఆర్ అన్నారు. చాలా రాష్ట్రాలు మెచ్చిన మోడల్ యావత్ దేశానికే నచ్చిన మోడల్
బుడిబుడి అడుగుల వయసులో బుల్లెటు వేగంతో దూసుకెళ్లిన సమగ్ర, సమ్మిళిత, సమీకృత మోడల్ అని ట్వీట్ చేశారు కేటీఆర్.

అసలు గోల్ మాల్ గుజరాత్ మోడల్ కు బంగారు తెలంగాణ మోడల్ తో పోలికెక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు. ఘనమైన గంగా జెమునా తెహజీబ్ మోడల్ కన్నా .. మతం పేరిట చిచ్చు పెట్టే గోద్రా అల్లర్ల మోడల్ నచ్చిందా..? అని రేవంత్ ను ప్రశ్నించారు. నిన్నటి దాకా గుజరాత్ మోడల్ పై నిప్పులు చెరిగి.. ప్రధాని పక్కన సీటు ఇవ్వగానే గొప్పలా ? ఇదేం నీతి ఇదేం రీతి అంటూ ఫైర్ అయ్యారు కేటీఆర్..

దేశం మెచ్చిన ఈ తెలంగాణ నమూనాను మోడీ ముందు కించ పరుస్తావా..? అంటూ సీరియస్ అయ్యారు కేటీఆర్. నమ్మి ఓటేసిన తెలంగాణపై ఎందుకీ నయవంచన?అని నిలదీశారు. నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెడతావా..? అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని బీఆర్ఎస్ ఆకాశమంత ఎత్తుకు ఎత్తింది కానీ.. నేడు కాంగ్రెస్ పాతాళంలో పాతిపెట్టేస్తోందన్నారు కేటీఆర్.