సీఎంతో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప భేటీ

0
14

సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భేటీ అయ్యారు. బీఆర్ఎస్-బీఎస్పీ పొత్తుపై అసంతృప్తితో ఉన్న ఆయన సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దీనికి ముందు ఆయన మంత్రి పొంగులేటితో కలిసి ఆయనతో సుమారుగా గంటకు పైగా చర్చించారు. కోనేరు త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. పార్టీ మార్పుపై కోనేరు కోనప్ప స్పందించారు. కేసీఆర్ తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీపై నాకు కనీస సమాచారం లేదు. పార్టీలో ఉండొద్దని కార్యకర్తలు ఒత్తిడి తెస్తున్నారు. సా.4 గంటలకు భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా అని తెలిపారు.

రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తుపెట్టుకుంటున్నట్లు మంగళవారం రెండు పార్టీల అధ్యక్షులు ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. బీఎస్పీతో పొత్తు విషయంలో అసంతృప్తికి గురైన కోనప్ప బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

కాగా గత ఎన్నికల్లో సిర్పూర్ నుంచి కోనప్ప పై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఇక్కడి నుంచి బీజేపీ తరుపున పోటీ చేసిన పాల్వాయి హరీష్ బాబు 3 వేల ఓట్ల తేడాతో కోనప్పపై విజయం సాధించారు. తాజాగా.. బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన కోనప్ప త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 12 లేదా 13న ఆయన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.