ఉచిత ఎల్ఆర్ఎస్ అమలు చేయాలంటూ బీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. ఉచితంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్‌ను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు.
ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు.. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్ చేయాలని కోరుతున్నారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మాట తప్పుతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హైదరాబాద్ లో అమీర్ పేటలోని మైత్రివనం వద్ద కార్యకర్తలతో ధర్నాలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక ఫీజులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరారు. ఉచిత ఎల్ఆర్ఎస్ అమలు చేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు.