బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తీవ్రమైన జ్వరం వచ్చినట్లు ఆ పార్టీ ట్విట్టర్లో వెల్లడించింది. ఈ కారణంగానే ఆయన ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు వెల్లడించింది. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని, ఒకట్రెండు రోజుల్లో పూర్తిగా నయమయ్యే అవకాశం ఉందని డాక్టర్ తెలిపినట్లు పేర్కొంది.
కొన్ని రోజులుగా విస్తృతంగా అనేక సభలు సమావేశాలలో పాల్గొన్న కేటీఆర్ గత రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఫ్లూ లక్షణాలతో బాధపడుతున్నారు. మూడు రోజుల కింద కామారెడ్డిలో జరిగిన సమావేశం అనంతరం జ్వరంతో అస్వస్థతకు గురైన కేటీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు కరీంనగర్ లో జరుగుతున్న భారీ బహిరంగ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఇంటి వద్దనే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అవుతుందని తెలియజేశారు.
కరీంనగర్ లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇవాళ బీఆర్ఎస్ శంఖారావం పూరించనుంది. తమకు అచ్చొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. కరీంనగర్ ను ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ సెంటిమెంట్ గా భావిస్తారు. అక్కడ అడుగుపెట్టిన ప్రతి పనీ విజయవంతం అవుతుందని ఆయన నమ్ముతారు. సెంటిమెంట్‌గా భావించే కరీంనగర్ వేదికగా ఇవాళ కదనభేరి సభను నిర్వహించనుంది. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకి కరీంనగర్ లో కథనభేరి సభ జరగనుంది. బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తోంది. లక్ష మంది సభకు వచ్చేలా ఏర్పాట్లు చేశామని గులాబీ శ్రేణులు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల ప్రచార సభ కావడంతో కేసీఆర్ స్పీచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా వినోద్ కుమార్ ను, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.