బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. సీట్ల సర్దుబాటుపై త్వరలో సమావేశం అవుతామని టీడీపీ నేత కనకమేడల వెల్లడించారు. పార్టీ బలాబలాలను బట్టి స్థానాలపై నిర్ణయం ఉంటుందన్నారు. బీజేపీ, జనసేన పోటీ చేయగా మిగిలిన సీట్లలో టీడీపీ బరిలో నిలుస్తుందని వివరించారు. అధికారం కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్ కోసమే పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే పొత్తు లక్ష్యమన్నారు.
ఇక, జనసేన, బీజేపీకి కలిసి 8 ఎంపీ సీట్లు ఇస్తారని ప్రచారం సాగుతోంది.. బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇస్తే.. మిగతా రెండు ఎంపీ స్థానాల్లో జనసేన.. లేదా బీజేపీకి ఐదు సీట్లు ఇస్తే.. జనసేకు మూడు ఎంపీ సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. అరకు, నరసాపురం, రాజమండ్రి, తిరుపతి, రాజంపేట, హిందూపురంలో బీజేపీ పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.