తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం మునుపెన్నడూ లేని ఉత్కంఠ మధ్య మలుపులతో కొనసాగుతూనే ఉంది. ఇదో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ అంటున్నారు పరిశీలకులు. ఎవరి పరిధిలో వాళ్లు చేసింది కరెక్టే అనిపించినా.. ఫైనల్ గా ఏం జరుగుతుందో వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు.
గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంపై ఈ ఉదయం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోదండరామ్, అమీర్ అలీఖాన్‌లను నియమిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ను కొట్టిపారేసింది. కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలని ఆదేశించింది. మంత్రి మండలి నిర్ణయానికి గవర్నర్ కట్టుబడి ఉండాలని సూచించింది. అలాగే గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణ నామినేషన్లను తిరస్కరిస్తూ తెలంగాణ గవర్నర్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టివేసింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై అభ్యంతరం ఉంటే.. ఫైల్ తిప్పి పంపించాలి తప్ప.. నియామకాన్ని కొట్టివేసే అధికారం గవర్నర్‌కు లేదని తెలిపింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని కోర్టు తెలిపింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ నియమాకాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలు పిటిషన్ దాఖలు చేశారు. గతంలో తాము వేసిన పిటిషన్ పై విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకాలను ఆపాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించవద్దని మండలి చైర్మన్ ను ఆదేశించింది. దాంతో కోదండరామ్, అమీర్ అలీఖాన్‌ల ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడింది. ఇప్పుడు కోర్టు ఆదేశాలను గవర్నర్ పాటిస్తారా.. అప్పటి ప్రభుత్వమే ఇప్పుడు లేదు కాబట్టి గవర్నర్ ఏం చేస్తారు.. ప్రభుత్వం ఏం చేస్తుంది.. అన్నది తేలాల్సి ఉంది.