బీఆర్ఎస్ vs బీజేపీ .. కరీంనగర్ లో వేడెక్కిన రాజకీయాలు..

0
9

పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, బీఆర్ ఎస్ ముందున్నాయి. ఇప్పటికే కరీంనగర్ నుంచి సిట్టింగ్ బండి సంజయ్, నిజామాబాద్ సిట్టింగ్ ధర్మపురి అర్వింద్ పోటీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్వింద్ (కోరుట్ల), సంజయ్(కరీంనగర్)లు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోయారు. ఇద్దరూ రాష్ట్రంలో ఫైర్ బ్రాండ్ నేతలుగా గుర్తింపు పొందినవారే. వీరిద్దరూ ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు.

పెద్దపల్లి పార్లమెంటుకు బీజేపీ ఇంకా ఎవరినీ ప్రకటించలేదు. గత పార్ల మెంటు ఎన్నికల్లో ఇక్కడ నుంచి బీజేపీ అభ్య ర్థిగా ఎస్.కుమార్ పోటీచేసిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ ఎస్సీ రాష్ట్ర మోర్చా అధికార ప్రతినిధి జాడి బాల్రెడ్డి, ఆలయ ఫౌండేషన్ సీఈవో మిట్టపల్లి రాజేందర్ కుమార్, విశ్వహిందూపరిషత్ నాయకుడు అయోధ్య రవి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు.

ఇక కరీంనగర్, పెద్దపల్లి స్థానాలకు బీఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటించింది. మాజీ ఎంపీ, ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ కరీంనగర్ నుంచి బరిలో దిగుతున్నారు. ఇక మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి నుంచి బరిలో దూకుతున్నారు. నిజామాబాద్ ఎంపీ స్థానానికి ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాజయం చవిచూసిన కారు పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలన్న సంకల్పంతో ఉంది. ఇప్పటికే బండి సంజయ్- వినోద్ కుమార్ ల మధ్య రాజకీయ ఆరోపణలు మొదలైన సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించగానే వేసవి రాజకీయం మరింత వేడెక్కనుంది.