మంగళగిరిలో ఓడినా ఇక్కడే ఉంటూ సొంత నిధులతో సేవ చేస్తనన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా లోకేశ్. పేదరికం లేని మంగళగిరి తన కల అని అన్నారు. మంగళగిరి ప్రజలు వరుసగా రెండుసార్లు అవకాశం ఇచ్చినా కనీసం మంచినీళ్లు ఇవ్వలేని స్థితిలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ఉన్నారని విమర్శించారు. మంగళగిరిని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మాస్టర్ ప్లాన్ తన వద్ద ఉందన్నారు.
రానున్న ఎన్నికల్లో అవకాశం ఇస్తే ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటానన్నారు నారా లోకేశ్. గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని పేదలకు 20 వేల ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వారికి పూర్తి హక్కులతో పట్టాలు అందజేస్తానని హామీనిచ్చారు. నీలం బటన్ నొక్కి రూ.10 ఖాతాలో వేస్తూ ఎర్ర బటన్‌తో రూ.100 కొట్టేయడం సీఎం జగన్‌కు వెన్నతోపెట్టిన విద్య అని ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచారన్నారు.