సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల కమిషన్ ఖాళీ అయిన సంగతి దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పై దీనిపై నానా యాగీ చేస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేయనున్నారు.
గత ఫిబ్రవరిలో ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. మార్చి 8నాడు శుక్రవారం రోజున అనూహ్యంగా మరో కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడటంతో.. ఎన్నికల కమిషన్ నిర్వహణ బాధ్యత నెరవేర్చేందుకు కమిషనర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయనున్నారు.
న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, హోంశాఖ కార్యదర్శి, సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న సెర్చ్ కమిటీ మొదట ఒక్కో పోస్టుకు ఐదుగురి పేర్లతో వేర్వేరు జాబితాలను సబ్ మిట్ చేయనున్నారు. వారిలో నుంచి ప్రధాని మోదీ, కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి, కేంద్ర మంత్రి సభ్యులుగా ఉన్న కీలక ఎంపిక కమిటీ ఒక్కొక్కరిని కమిషనర్‌గా ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారి పేర్లకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తారు. ప్రధాని అధ్యక్షతన ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ ఈ నెల 15వ తేదీన సమావేశం కానుంది.