AP Bjp New Strategy: ఏపీలో పాగా కోసం బీజేపీ కొత్త వ్యూహం

0
20

ఆంధ్రప్రదేశ్ కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఈరోజు సాయంత్రం ఆ మూడు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు. బిజెపి విషయానికి వచ్చేసరికి పది అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాలను కేటాయించారు. ఈ లెక్కన తెలుగుదేశం పార్టీ పోటీ చేసేవి 144 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాలు. ఇప్పటికే 94 అసెంబ్లీ స్థానాలను టిడిపి ప్రకటించింది. జనసేన కూడా ఐదుగురు అభ్యర్థులను వెల్లడించింది. బిజెపి మాత్రం ఇంతవరకు ఒక్క అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. దేశవ్యాప్తంగా పార్లమెంట్ స్థానాల అభ్యర్థులను ప్రకటించినా..ఏపీలో పొత్తుల నేపథ్యంలో పెండింగ్ లో పెట్టింది.

బిజెపికి కేటాయించే సీట్ల విషయంలో రకరకాల ప్రచారం జరిగింది. బలహీనమైన నియోజకవర్గాలను బిజెపికి కేటాయించేందుకు టిడిపి కసరత్తు చేస్తోందని టాక్ నడిచింది. బిజెపి విశాఖ లోక్సభ స్థానాన్ని కోరుకుంటే.. టిడిపి మాత్రం విజయనగరం స్థానాన్ని కేటాయించేందుకు మొగ్గు చూపింది. విశాఖ తో పోల్చుకుంటే విజయనగరంలో బిజెపికి బలం అంతంత మాత్రమే. అటు అరకు పార్లమెంట్ స్థానం పరిధిలో సైతం అదే పరిస్థితి. గత మూడు ఎన్నికల్లోను టిడిపికి ఇక్కడ ప్రతికూల ఫలితం వచ్చింది. ఈసారి కూడా అక్కడ వైసీపీకే మొగ్గు కనిపిస్తోంది. అందుకే ఆ స్థానాన్ని బిజెపికి టిడిపి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.

అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మెజారిటీ నియోజకవర్గాలను రాయలసీమలో కేటాయించారు. అక్కడ వైసీపీకి బలం ఉంటుంది. టిడిపికి గెలుపు అవకాశాలు చాలా తక్కువ. అందుకే అక్కడ సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. మరోవైపు పొత్తులో భాగంగా కచ్చితంగా గెలిచే స్థానాల్లో… బిజెపిలో ఉన్న టిడిపి అనుకూలమైన నేతలకు టికెట్లు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు అన్న ప్రచారం ఉంది.