తెలంగాణలో నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు తప్పకుండా ఒంటిపూట బడులను అమలులోకి తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ విషయమై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని పేర్కొంది.అనంతరం మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపుతారు. విద్యాసంవత్సరం ముగిసే (ఏప్రిల్ 23) వరకు ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి
అయితే పదో తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. పదో తరగతి పరీక్ష కేంద్రాలున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ తరగతులను నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయివేటు విద్యాసంస్థలు కూడా ఈ సమయం పాటించాలని విద్యాశాఖ ఆదేశించింది.
మరోవైపు తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గత 2, 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. వచ్చే వారంలో ఎండ తీవ్రత ఇంకా అధికం అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అవసరమైతేనే పగటిపూట బయటకు రావాలని, ఉ.11 గంటల నుంచి మ.3.30 వరకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఈ నెలాఖరులోగా 45 డిగ్రీలకు చేరే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది