దేశ వ్యాప్తంగా ఇవాళ ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈసీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. లోక్‌సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది .ఏపీతో పాటు అరుణాచల్‌ప్రదేశ్, ఒడిసా, సిక్కిం రాష్ట్రాలకు షెడ్యూల్ రిలీజ్ చేయనుంది. అలాగే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది.
ఇటీవల చనిపోయిన ఇతర కారణాలతో దేశవ్యాప్తంగా ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు కూడా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఈసీ సిద్దమయ్యింది. తెలంగాణ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ సెగ్మెంట్‌కు కూడా ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది.
జూన్ 16వ తేదీతో ముగియనున్న లోక్‌సభ గడువు
జూన్ 16వ తేదీతో లోక్‌సభ గడువు ముగియనుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్ 2వ తేదీతో, ఏపీ అసెంబ్లీ గడువు జూన్ 16తో, ఒడిసా అసెంబ్లీ గడువు జూన్ 24వ తేదీతో కంప్లీట్ అవుతుంది.
గత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను 2019 మార్చి 10న ఈసీ రిలీజ్ చేసింది. ఏడు ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహించి, మే 23న రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. ఈసారి కూడా దేశవ్యాప్తంగా మొత్తం ఏడు ఫేజ్‌లలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తుంది.