తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతుల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ చేశారు. వీటిని పరిశీలించి పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు సభ్యులతో ఒక కమిటీని నియమించారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ జి. చిన్నారెడ్డి నేతృత్వంలో జేఏసీ ఛైర్మన్, రిటైర్డ్ ప్రొఫెసర్ కోదండరామ్, ఐఏఎస్ అధికారి దివ్యను సభ్యులుగా నియమించారు.
మార్చి 10వ తేదీన తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి ఎంసీహెచ్ ఆర్డీలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంఘాల ప్రతినిధులు ఇచ్చిన విజ్ఞప్తులు వినతులన్నింటినీ పరిశీలించి, ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. వీటిని పరిశీలించి సాధ్యాసాధ్యాలు, పరిష్కార మార్గాలను సూచించే బాధ్యతను త్రిసభ్య కమిటీకి అప్పగించారు.
టీజీవో, టీఎన్జీవో సంఘాల ప్రతినిధులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్ సంఘాల నేతలు తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. టీచర్లకు సంబంధించిన మల్టీ జోన్, స్పౌస్ సమస్యలు, స్థానికత, ఉపాధ్యాయుల బదిలీలు, ఆరోగ్య బీమా, పెండింగ్‌లో ఉన్న డీఏలు తదితర సమస్యల గురించి ముఖ్యమంత్రికి విన్నవించారు. ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పరిష్కరించే దిశగా సలహాలు సూచనలతో నివేదికను అందజేయాలని కమిటీకి సూచించారు రేవంత్ రెడ్డి.