చికెన్ ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలో ఆదివారం చికెన్ స్కిన్ లెస్ కిలో రూ.200 నుంచి 220 ధర పలికింది. వారం రోజుల క్రితం వరకు మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావం కారణంగా కోళ్ళు మృత్యువాత పడటంతో ఒక్కసారిగా ధరలు పెరిగాయి. కోళ్ళతో పాటే గుడ్డు ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గతనెల్లో రూ.7 పలికిన గుడ్డు ధర ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో రూ.6 నుంచి రూ.6.50 ధర పలుకుతోంది. హోల్సేల్ మార్కెట్లో రూ.5 నుంచి రూ.5.50 ధర పలుకుతోంది. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ తో గత నెల్లో చికెన్ ధరలు భగ్గుమన్నాయి. కార్తీక మాసంలో మాంసం ధరలు భారీగా పడిపోయాయి. అప్పట్లో కేజీ చికెన్ రూ.130 నుంచి రూ.140కు విక్రయించారు. దీంతో పౌల్ట్రీ నిర్వాహకులు భారీగా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కోళ్ళ పెంపకాన్ని తగ్గించారు.
ఇటీవల బర్డ్ ఫ్లూ సోకి కోళ్ళు మృత్యువాత పడ్డాయి. దీంతో ధరలకు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఇప్పట్లో ధరలు తగ్గే అవకాశం లేదనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా ధరలు తగ్గడంపై నాన్వెజ్ ప్రియులు ఖుషీ అవుతున్నారు. ఎన్నికల ప్రచారం ఊపందుకోవడంతో ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్ధులు ముమ్మరంగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. దీంతో పసందైన రాజకీయ విందులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విందుల్లో ముక్క లేనిదే ముద్ద దిగని పరిస్థితి కాబట్టి చికెన్ కు మంచి డిమాండ్ పెరిగింది. ఈ తరుణంలో ధరలు తగ్గుముఖం పట్టడం రాజకీయ నాయకు లకు కొంతమేర ఖర్చు కలిసొచ్చినట్లైంది.