TG Politics: పసుపు రైతులకు మంచి రోజులు తెచ్చింది మేమే.. ప్రధాని హాట్ కామెంట్స్

0
31

నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బహిరంగ సభలో మాట్లాడారు ప్రధాని నరేంద్రమోడీ. పసుపు ధరపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో బీజేపీ తలపెట్టిన విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ మాట్లాడారు. తాము రూ.6,400 కోట్లతో రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని పునరుద్ధరించామని తెలిపారు. పసుపు రైతులను బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. పసుపు ధరను క్వింటాల్ కు రూ.6వేల నుంచి రూ.30 వేలకు పెంచామన్నారు. రైతులకు మంచి రోజులు తెచ్చిన ఘనత బీజేపీదే అన్నారు.

కేసీఆర్ సహా ఇక్కడి గత ప్రభుత్వాలు నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేకపోయాయన్నారు ప్రధాని మోడీ. మళ్లీ అధికారంలోకి రాగానే వచ్చే పదేళ్ల తెలంగాణ ప్రగతిపై ఫోకస్ చేస్తామన్నారు. తెలంగాణలో రైలు, రోడ్డు మార్గాలను అభివృద్ధి చేస్తామన్నారు. తనకు అధికారం కాపాడుకోవడం కన్నా.. ప్రజల శ్రేయస్సు కోసం నిర్ణయాలు తీసుకోవడమే ముఖ్యమన్నారు.

తెలంగాణలో బీజేపీ ప్రభంజనంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కొట్టుకుపోతాయన్నారు ప్రధాని మోడీ. ఇక్కడ బీజేపీ అధికారంలో ఉంటే.. ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ల అవినీతిపై కేంద్రం విచారణ చేపడితే.. మోడీని తిట్టడం ప్రారంభిస్తారన్నారు. అసెంబ్లీలో ఎన్నికల్లో బీఆర్ఎస్ పై ప్రజలకు ఉన్న ఆగ్రహం బయటపడిందన్నారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనానికి జనమే సాక్ష్యంగా నిలవబోతున్నారని జోస్యం చెప్పారు ప్రధాని మోడీ