తెలంగాణలో మిగిలిన 13 మంది లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఇవాళ స్పష్టత రానుంది. కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ ఉదయం కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉదయం 10 గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి.
ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు సమావేశాలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే సీడబ్ల్యూసీ భేటీలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. పార్టీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, సీడబ్ల్యూసీ మెంబర్లు ఇందులో పాల్గొంటారు. ఈ భేటీలో భాగంగా సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేయనున్నారు. భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ అనే ఐదు న్యాయాల పేరుతో మేనిఫెస్టో రూపొందించనున్నట్లు తెలిసింది. ప్రతి విభాగంలో ఐదు గ్యారెంటీల పేరుతో మొత్తంగా 25 గ్యారెంటీలు చేర్చే అవకాశం ఉంది.
నిన్న 10 టెన్ జన్ పథ్ లో ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణలో 100 రోజుల పాలనపై చర్చించారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితిని వివరించారు.