Taslima Mohammed13: సార్లు ఉత్తమ అధికారిణిగా అవార్డు.. లంచం తీసుకుంటూ దొరికింది

0
19

తెలంగాణలోని ములుగు సబ్‌రిజిస్ట్రార్ తస్లిమా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అధికారిణి అయినా కూలీ పనులు చేస్తూ, పేదల మధ్య తిరుగుతూ, నిరాడంబరంగా ఉన్నట్లు వీడియోలు చేస్తూ ఆమె పాపులరయ్యారు. లంచం అనే మాట వినిపిస్తే ఆమె భద్రకాళీ అవుతుందనే అభిప్రాయమూ ఉంది. ఉత్తమ అధికారిణిగా 13సార్లు అవార్డు అందుకున్నారామె. కానీ.. ఇదంతా రీల్ లైఫ్. తాజాగా ఆమె రియల్ లైఫ్‌ గురించి తెలిసి అంతా షాకయ్యారు. ఇంతకీ ఎలా దొరికిదంటే..

భూమి రిజిస్ట్రేషన్ కోసం లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. భూమి కొనుగోలు చేసిన వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం సబ్జిస్ట్రార్ కార్యాలయానికి రాగా రూ. 19 వేల 200 లంచం డిమాండ్ చేసి ఆ మొత్తాన్ని తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దంతాలపల్లి మండలం, దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి తాను కొనుగోలు చేసిన భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సంప్రదించగా లంచం ఇవ్వాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఆలేటి వెంకటేష్ డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో హరీష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. హరీష్ నుంచి రూ. 19 వేల 200 లంచంగా తీసుకున్న వెంకటేష్ ఆ మొత్తాన్ని తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు వెంకటేష్ ను అదుపులో తీసుకొని ఆ మొత్తాన్ని స్వాధీనం పరచుకున్నారు. అనంతరం అధికారులు నిర్వహించిన సోదాలలో లెక్కల్లో లేని మరో రూ. లక్షా 72వేలను స్వాధీనపరచుకొని సీజ్ చేసినట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమా, డాటా ఎంట్రీ ఆపరేటర్ వెంకటేష్ ను అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.