Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ సోదాలు

0
11

ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్.. ఆమె బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. కవిత భర్త అనిల్ బంధువుల ఇళ్లపైనా రైడ్స్ జరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఆమె భర్తకూ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. కేసు దర్యాప్తును కోర్టు పరిశీలించనుంది. కాగా కవితను ఈ నెల 15న ఈడీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచింది. వారం రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే.

ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలపై ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. బెయిల్‌పై ట్రయల్ కోర్టుకు వెళ్లాలని కవిత తరఫు న్యాయవాదులకు సూచించింది. బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది.