TG Politics: పార్లమెంట్‌లో బహుజన వాదం వినిపిస్తానన్న ఆర్ఎస్‌పీ

0
19

BRSలో కీలక పదవి దక్కించుకోబోతున్న ఆర్ఎస్ ప్రవీణ్ పార్టీలో చేరిక తర్వాత తన గులాబీ స్వరాన్ని వినిపించారు. ఇటీవల బీఆర్ఎస్‌లో చేరిన ఆర్ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ను నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్‌ ప్రకటించింది. తన రాజకీయ ప్రస్థానంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు మిమ్మల్ని బాధపెట్టి ఉండొచ్చని శ్రేయోభిలాషులను ఉద్దేశించి అన్నారు.

ఒక లక్ష్య సాధన కోసం కొన్ని త్యాగాలు తప్పవని వ్యాఖ్యానించారు ఆర్ఎస్పీ. ఈ విషయం అర్థం చేసుకోవాలనీ.. కొందరు సోషల్‌ మీడియా వేదికగా తీవ్రంగా విమర్శలు చేయడం మానుకోవాలని సూచించారు. తనపై నమ్మకంతో నాగర్‌కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చినందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లు పీడిత ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేశానని చెప్పారు. ఇక చట్టసభల్లో కూడా మీ గొంతు వినిపిస్తానని అన్నారు.

అసెంబ్లీలో బహుజనుల గొంతుక ఉండాలని రాత్రింబవళ్లు శ్రమించినప్పటికీ.. తొలి ప్రయత్నం విఫలమైందన్నారు ప్రవీణ్ కుమార్. బీజేపీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడే సత్తా కాంగ్రెస్‌కు లేదనీ.. అందుకే బీఆర్ఎస్‌లో చేరినట్లు చెప్పారు. తాను బహుజనుల బంగారు భవిష్యత్‌ కోసం పోరాడుతూనే ఉంటానని ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ తెలిపారు. తన ఈ పోరాటంలో శ్రేయోభిలాషులంతా కలిసి రావాలని ఆర్ఎస్ ప్రవీణ్‌ కుమార్ పిలుపునిచ్చారు.