హార్దిక్ పాండ్యాకు గడ్డు కాలం నడుస్తోంది. ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ముంబై జట్టు ఓడిపోవడం కంటే, మైదానంలో ముంబై అభిమానులే తమ కెప్టెన్ హార్దిక్ పాండ్యాని గేళి చేయడం హాట్ టాపిక్ అవుతోంది. తొలి మ్యాచ్‌లోనే పాండ్యాకి ఇంత పరాభవం ఎదురైతే, సీజన్ అంతా తను కెప్టెన్ గా ఉండగలడా, ఆటగాడిగా తన పూర్తి సామర్థ్యం ప్రదర్శించగలడా? అనేది అనుమానంగా మారింది.
కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను పెట్టడమే చాలామందికి నచ్చలేదు. లోకల్ హీరో రోహిత్ శర్మను మహారాష్ట్రియన్స్ దేవుడిగా కొలిచారు. ఎప్పుడైతే రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి తప్పించారో, అప్పుడే ముంబై అభిమానులు తమ నిరసన వ్యక్తం చేశారు. ముంబై ఇండియన్స్ జట్టుని ఒకే రోజు సోషల్ మీడియాలో లక్షమంది అభిమానులు అన్ ఫాలో చేశారు. మైదానంలో రోహిత్ కి బ్రహ్మరథం పట్టి, హార్దిక్ పాండ్యాని గేలి చేశారు. మైదానంలో కుక్క పరిగెడుతోంటే… ‘హార్దిక్.. హార్దిక్’ అంటూ అరవడం…దీనికి పరాకాష్ట. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
రోహిత్ ని బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ కి పెట్డడం, మాటి మాటికీ రోహిత్ కు కమాండ్స్ ఇచ్చి ఫీల్డింగ్ ప్లేస్ మెంట్ మార్చడాన్ని అభిమానులు తట్టుకోవడం లేదు. కొన్ని సందర్భాల్లో దురుసుగా ప్రవర్తించడం ఇవన్నీ అభిమానులు నోటీస్ చేశారు. దాంతో పాండ్యాపై ట్రోలింగ్ బాగా పెరిగిపోయింది. మ్యాచ్ ఓడిపోవడం, చివర్లో ముంబైని పాండ్యా గెలిపించకపోవడం మరింత ఆజ్యం పోశాయి. మైదానంలో హార్దిక్ తీసుకొన్న నిర్ణయాల్ని సీనియర్లు కూడా తట్టుకోలేని పరిస్థితి. తొలి ఓవర్ ని బుమ్రాకి అప్పగించకుండా, హార్దిక్ స్వయంగా వేయడం, ధారాళంగా పరుగులు ఇచ్చుకోవడం విమర్శకుల కారణమైంది. మొత్తానికి ముంబై కెప్టెన్ గా తొలి మ్యాచ్‌లో హార్దిక్‌కు చేదు అనుభవాలు పెరుగుతున్నాయి.