TG Politics: దయాకర్ రావుకు ఉచ్చు బిగుస్తోందా..? తాజా కంప్లయింట్‌తో రేవంత్ యాక్షన్

0
27

బీఆర్ఎస్ నేతల అడ్డగోలు దందాలు రోజురోజుకూ బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్‌లు చేసి.. వసూళ్లకు, కబ్జాలకు పాల్పడినట్లుగా వస్తున్న ఆరోపణలపై ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ రావు ఇప్పటికే ఫిర్యాదులు చేయగా.. తాజాగా శరణ్ చౌదరి అనే వ్యక్తి నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు తనను అక్రమంగా నిర్బంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు పేర తన ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని.. దాంతోపాటు రూ.50 లక్షల నగదును తీసుకున్నారంటూ సిఎం రేవంత్ రెడ్డికి ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. 2023, ఆగష్టు 21వ తేదీన తాను ఆఫీస్‌కు వెళ్తుండగా కొందరు సివిల్ దుస్తుల్లో వచ్చి తనను అడ్డుకుని తాము పోలీసులమని చెప్పి సిసిఎస్‌కు తీసుకెళ్లారని, అక్కడకు వెళ్లిన తర్వాత పలువురి నుంచి అక్రమంగా డిపాజిట్‌లు సేకరించినట్టు తనపై కేసు పెట్టినట్లు ఏసిపి ఉమామహేశ్వర్ రావు బెదిరించారని, అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, డిసిపి రాధా కిషన్ రావు సూచనల మేరకు తనను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి కొట్టారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. బలవంతంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బంధువు విజయ్ పేరు మీద తన ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, రెండు రోజులపాటు తనను అక్రమంగా నిర్భంధించి తన కుటుంబ సభ్యులను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించారని, తన స్నేహితుడు రూ.50 లక్షలు ఇచ్చిన తర్వాత తనను వదిలి పెట్టారని ఆయన తెలిపారు.

హైకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే ఏసీపీ ఉమా మహేశ్వర్‌రావు బెదిరించి పిటిషన్‌ను ఉపసంహరించుకునేలా చేశారని శరణ్ చౌదరి సీఎం ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. దీంతో తగిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీ అయింది. ఐతే… మంగళవారం ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టిన ఎర్రబెల్లి తనపై కావాలనే వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని.. ఇది రాజకీయ కుట్ర అని మండిపడ్డారు.