Bengaluru Water Crisis: వామ్మో… తాగునీరు వేస్ట్ చేసినందుకు లక్ష ఫైన్

0
14

బెంగళూరులో గత కొన్ని రోజులుగా తాగునీటి సమస్యలు వెంటాడుతున్న సంగతి తెలిసిందే.నీటిని పొదుపుగా వాడుకోవాలని ఎన్నో ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. తాగునీటిని వేస్ట్ చేయకుండా ఉండేందుకు ఎన్నో రూల్స్ తీసుకొస్తుంది. లేటెస్ట్ గా నిబంధనలు ఉల్లంఘించి తాగునీటిని దుర్వినియోగం చేసిన 22 కుటుంబాలకు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు అధికారులు భారీగా ఫైన్ వేశారు.

తాగునీళ్లను కార్ వాషింగ్, గార్డెనింగ్ కోసం ఉపయోగించిన ఒక్కో ఫ్యామిలీకి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.1.10 లక్షల ఫైన్ వేశారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి కొరత ఉంటే.. నిర్లక్ష్యంతో వీరు బోర్డు నిబంధనలు ఉల్లంఘించారని అధికారులు తెలిపారు. బెంగళూరు సిటీలోని వివిధ ఏరియాల్లో ఈ జరిమానాలు వసూలు చేశామని చెప్పారు. సిటీ సౌత్ రీజియన్ నుంచే అత్యధికంగా రూ.80 వేలు కలెక్ట్ చేసినట్టు వివరించారు. బెంగళూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, నీటిని వృథా చేయొద్దంటూ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అవగాహన కల్పిస్తున్నా.. కొందరు పట్టించుకోవడం లేదన్నారు. అత్యవసర పనులకు మాత్రమే తాగునీటిని ఉపయోగించాలని సూచించారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ ఏరియాల్లో తాగునీళ్లను వెహికల్స్ వాష్ చేసేందుకు, కన్​స్ట్రక్షన్స్​కు, ఎంటర్​టైన్​మెంట్​కు ఉపయోగించడానికి వీల్లేదన్నారు.

నీటికి సంబంధించి ప్రవేశపెట్టిన నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బీడబ్ల్యూఎస్ఎస్​బీ అధికారులు హెచ్చరించారు. రూల్స్ ఉల్లంఘించి ఫైన్ కట్టినవాళ్లు మళ్లీ.. నీళ్లు వృథా చేసినట్టు తమ దృష్టికి వస్తే.. ప్రతి సారీ రూ.500 అదనంగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. హోలీ సెలబ్రేషన్స్​ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. హోలీ పండుగ సందర్భంగా పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్​ల కోసం కావేరీ, బోర్​వెల్ వాటర్ ఉపయోగించొద్దన్నారు.