మాజీ సీఎం కేసీఆర్ గొప్ప నాయకుడే కానీ.. ఆయన పక్కన ఉన్న వాళ్లే కేసీఆర్ ను బ్రష్టు పట్టించారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచి పార్లమెంట్ కి వెళ్తానన్నారు. తన అభ్యర్థిత్వంపై కేటీఆర్ న్యాయస్థానానికి వెళితే తాను న్యాయస్థానంలోనే సమాధానం చెప్తానన్నారు. సీఎం రేవంత్ పై అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు.. మూడు నెలల్లో ముఖ్యమంత్రి 3500 కోట్లు సంపాదిస్తే పది సంవత్సరాలలో వాళ్లు ఎన్ని సంపాదించి ఉండొచ్చు అని ప్రశ్నించారు.
తాను ఆస్తులు కాపాడుకోవడానికి పార్టీ మారినట్లు వస్తున్న ఆరోపణలో నిజం లేదన్నారు దానం. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత తాను ఆస్తులు కూడా పెట్టినట్టు చూపిస్తే వదులుకునేందుకు సిద్ధమన్నారు. టీఆర్ఎస్ లో ఓ కార్యకర్తలాగానే పని చేశానని, ఇప్పుడు ఓ కార్యకర్తలాగానే పని చేస్తూ ఎంపీగా పోటీకి సిద్ధమైనట్లు ప్రకటించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికలలో తనదే విజయమని అనంతరం ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక జరగడం అందులో తమ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. కవిత అరెస్టుపై మీడియా ప్రశ్నించగా ఒక ఆడబిడ్డ గురించి తను మాట్లాడలేనని తెలిపారు.
సికింద్రాబాద్ బరిలో బీఆర్ఎస్ నుంచి పద్మారావు, బీజేపీ నుంచి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ మూడు పార్టీల నుంచి హోరాహోరీ పోరు జరగనుంది.