రాజకీయాల్లో ఎత్తుగడలే ముఖ్యం. అందునా ఎన్నికలంటే ఈ ఎత్తుగడలకు ప్రాధాన్యత ఎక్కువ. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థుల విషయంపై ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ జరుగుతోంది. అసదుద్దీన్ మరోసారి గెలుస్తారా.. బీజేపీ కానీ.. కాంగ్రెస్ కానీ కొత్త చరిత్ర తిరగరాస్తుందా అనేదానిపై చర్చ జరుగుతోంది.
మజ్లిస్ నేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీగా ఏకఛత్రాదిపత్యం వహిస్తున్నారు. ఈసారి ఎలాగైనా ఈ స్థానాన్ని తాము గెలవాలని బీజేపీ, కాంగ్రెస్‌లు భావిస్తున్నాయి. రాష్ట్ర రాజధాని కావడం ఈ లోక్‌సభ స్థానంపై ప్రధాన జాతీయ పార్టీలు మరింత దృష్టి పెట్టాయి. గెలుపు ప్రెస్టీజియస్ గా తీసుకున్న బీజేపీ.. హైదరాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలతను ప్రకటించింది.
కాంగ్రెస్ కూడా మరోసారి సెంటిమెంట్ ను అస్త్రంగా ప్రయోగించనుంది. లేడీస్ అండతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హైదరాబాద్ లో లేడీ కంటెస్టెంట్ ను పెట్టాలనుకుంటోంది. బీజేపీ మహిళా అభ్యర్థిని ప్రకటించడంతో.. కాంగ్రెస్ కూడా ఇదే బాటలో నడవాలని చూస్తోంది. దేశంలోనే కాదు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను హైదరాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించాలని అభిమానులు కోరుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జా కొనసాగారు. హైదరాబాదీలు సానియామీర్జాకు గట్టిగా మద్దతు ఇస్తారని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సానియా మీర్జా పేరును అజారుద్దీన్ ప్రపోజ్ చేశారని తెలుస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ మీటింగ్ లో దీనిపై క్లారిటీ రానుంది. సీఎం రేవంత్ ఢిల్లీలోనే ఉండి తెలంగాణ మూడో జాబితాపై కసరత్తు చేస్తున్నారు.