భక్తులందరూ భారీగా చేరుకున్న వేళ అయోధ్య రాముడి సన్నిధిలో బుల్లెట్ శబ్దం ఒక్కసారిగా అలజడి రేపింది. అయోధ్య రామ మందిరం ప్రాంగణంలో అపశృతి చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం టెంపుల్ కాంప్లెక్స్‌లో తుపాకీ మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో జవాన్‌కు తీవ్ర గాయాలు అయినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
రామజన్మభూమిలోని ఆలయంలో రామ్ ప్రసాద్ (50) అనే జవాన్ టెంపుల్ కాంప్లెక్స్‌లో ఉన్నాడు. ఆ సమయంలో తన తుపాకీని శుభ్రం చేస్తున్నాడు. దాంతో..తుపాకీని తుడుస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. తుపాకీ నుంచి వచ్చిన బుల్లెట్ జవాన్ ప్రసాద్ శరీరంలో నుంచి దూసుకెళ్లింది. దాంతో అతనికి తీవ్ర గాయం అయ్యింది. తుపాకీ పేలుడు శబ్ధం వినగానే భక్తులు కొంత ఆందోళన చెందినట్లు సమాచారం.
ఆలయ అధికారులు వెంటనే స్పందించి రామ్ ప్రసాద్ వద్దకు వెళ్లారు. బుల్లెట్ తగిలి గాయపడ్డ అతన్ని వెంటనే చికిత్స కోసం అయోధ్య మెడికల్ కాలేజ్‌లో చేర్పించారు. అతని పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం లక్నోలోని కేజీఎంయూ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు అయోధ్య రామాలయ అధికారులు చెప్పారు. జవాన్ రామ్ ప్రసాద్ ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథీ జిల్లా అచల్‌పూర్ గ్రామానికి చెందిన వ్యక్తిగా అయోధ్య అదికారులు తెలిపారు.