111 మంది అభ్యర్థులతో విడుదలైన బీజేపీ ఐదో లిస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇంకా పార్టీలో చేరని వాళ్ల పేర్లు ఈ లిస్టులో ఉండటం చర్చనీయాంశమవుతోంది. మాజీ కాంగ్రెస్ కీలక నాయకులేగాక.. అసలు పార్టీలో లేని వారికి కూడా టికెట్లు వచ్చాయి. కేంద్ర మంత్రులు అశ్విని కుమార్ చౌబె, వి.కె సింగ్, పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ వంటి కీలక నాయకులు చోటు దక్కనివారిలో ఉన్నారు. సినీ నటులు కంగనా రనౌత్, అరుణ్ గోవిల్ కు టిక్కెట్లు దక్కడం విశేషం. ఎన్నికలకు ముందు ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన వారికి టిక్కెట్లు ఇచ్చారు.
కంగనా బీజేపీలో చేరక ముందే ఆ పార్టీ ఆమెకు టికెట్‌ను కేటాయించారు. రామాయణం టీవీ సీరియల్‌లో రాముడి పాత్రను పోషించిన అరుణ్ గోవిల్ యూపీలోని మీరట్ నుంచి పోటీ చేయనున్నారు. ఈయన 2021లో బీజేపీలో చేరారు. ఏపీ నుంచి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి తోపాటు.. సీతా సొరెన్, తపస్ రాయ్, కాంగ్రెస్ నుంచి వచ్చి కాషాయ కండువా కప్పుకున్న నవీన్ జిందాల్‌కు కురుక్షేత్ర సీటు, జితిన్ ప్రసాదాకు పిలిభిత్ స్థానాన్ని బీజేపీ కేటాయించింది. కేరళ బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్ర.. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేయనున్నారు.
కలకత్తా హైకోర్టు మాజీ జడ్జి అభిజిత్ గంగోపాధ్యారు పశ్చిమ బెంగాల్‌లోని తమ్లుక్ స్థానం టిక్కెట్ ఇచ్చారు. 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు జగదీశ్ షెట్టర్‌కు బెలగావ్ సీటును కేటాయించింది. జార్ఖండ్‌లోని అధికార కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)ను వీడిన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ సమీప బంధువు సీతా సొరెన్ కొన్ని రోజుల క్రితమే బీజేపీలో చేరారు. ఆమెకు టిక్కెట్ ఇచ్చారు. ఈసారి మిషన్ 400 సక్సెస్ చేసేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తోంది బీజేపీ.