TG Politics: సర్పంచ్ నుండి ఎంపీ అభ్యర్థిగా .. నీలం మధు ప్రస్థానం

0
59

నీలం మధు… ఇప్పుడు ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన పేరు రాష్ట్ర రాజకీయాల్లో బాగా వినబడింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో పఠాన్ చెరు నుండి బీఎస్పీ తరుపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరవాత కాంగ్రెస్ లో జాయిన్ అయి ఎంపీ బరిలో నిలిచారు. మెదక్ నుండి 11 మంది పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసుకుంటే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం నీలం మధు వైపే మొగ్గు చూపింది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంతో పలువురు కాంగ్రెస్‌ నేతలు ఎంపీగా పోటీచేసే అవకాశం కోసం ఎదురు చూశారు. మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి 11 మంది దరఖాస్తు చేసుకున్నారు. బలమైన అభ్యర్థి కోసం పార్టీ అన్వేషించగా, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మలారెడ్డి పేర్లు సైతం వినిపించాయి. పోటీ చేసేందుకు మైనంపల్లి విముఖత వ్యక్తం చేయడం, ఇటీవల నిర్మలారెడ్డికి కార్పొరేషన్‌ పదవి అప్పగించడంతో వారిద్దరి పేర్లను అధిష్టానం పరిగణనలోకి తీసుకోలేదు. చివరకు పటాన్‌చెరుకు చెందిన నీలం మధుతో పాటు 2009 కాంగ్రెస్‌, 2014లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీచేసిన నరేంద్రనాథ్‌ పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలించింది. ఆశావహుల బలాబలాలపై సర్వే చేయించింది. ముఖ్యనేతల అభిప్రాయాలను సేకరించిన అనంతరం నీలం మధు పేరును ఖరారు చేశారు.

పఠాన్ చెరువు మండలంలోని చిట్కుల్ గ్రామానికి చెందిన మధు, 2001 లో బీఆర్ఎస్ పార్టీతో తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. మొదట్నుంచీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొన్న ఆయన.. 2006లో పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన 2016లో ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 2014 ప్రాదేశిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున జడ్పీటీసీగా పోటీ చేశారు. 2019లో సర్పంచి ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన మధు.. ఎన్ఎంఆర్ యువసేన స్థాపించి.. కొంతకాలంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో తన వంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ప్రజల మన్నన పొందుతున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఅరెస్ తరుపున పటాన్ చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి, విఫలమయ్యారు. అప్పట్నుంచి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరతారని ప్రచారం సాగింది. కానీ ఆయన బహుజన సమాజ్ పార్టీ – బీఎస్పీలో చేరి పటాన్ చెరు నుంచి ఎమ్మెల్యేగా బరిలో దిగి ఓటమి పాలయ్యారు. ముదిరాజ్ సామాజిక వర్గంలో కీలక నేతగా ఎదుగుతున్నారు.