Delhi Politics: వాట్సప్‌లో కేజ్రీవాల్ నంబర్.. సపోర్ట్ ఇవ్వాలన్న భార్య

0
25

ఎన్నికల వేళ ఆప్ సానుభూతి రాజకీయం మొదలుపెట్టింది. తన భర్త నిజమైన దేశభక్తుడని, కోర్టులో వాస్తవాలు చెప్పడానికి ఎంతో ధైర్యం కావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ అన్నారు. ఆమె శుక్రవారం కేజ్రీవాల్‌ను ఆశీర్వదించండంటూ వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఈరోజు ఓ వీడియోను విడుదల చేశారు. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న తన భర్తకు మద్దతివ్వాలని ప్రజలను కోరారు. ఆయనను నియంత శక్తులను సవాల్ చేస్తున్నారని… ఈ సమయంలో ఆయనకు మన మద్దతు కావాలన్నారు.
కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తున్నామని అందరూ సందేశాన్ని పంపించాలని కోరుతూ వాట్సాప్ నెంబర్‌ను షేర్ చేశారు.

‘ఈరోజే కేజ్రీవాల్‌కు ఆశీర్వాదమిచ్చే వాట్సాప్ ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. మీరు మీ ఆశీర్వాదాలు, ప్రార్థనలు, దీవెనలు ఈ నెంబర్‌కు సందేశం రూపంలో పంపించండి’ అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు 8297324624 నెంబర్‌ను షేర్ చేశారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆరోగ్యం బాగా లేదని, దీంతో ఆయన కుటుంబం ఆందోళన చెందుతోందని ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన తీరు దారుణమని మండిపడ్డారు. కేజ్రీవాల్‌కు మద్దతుగా ఈ నెల 31న ప్రజలంతా రాంలీలా మైదాన్‌కు రావాలని కోరారు. ఢిల్లీలో డోర్ టు డోర్ ప్రచారం కూడా చేయనున్నారు.