ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని మోదీ మే నెలలో రాష్ట్రానికి రానున్నారు. మే 5 నుంచి 7 వరకు ఆయన రాష్ట్రంలో పర్యటిస్తారని తెలుస్తోంది. మే 13న పార్లమెంటు ఎన్నికల జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రచారం ఎన్నికలకు వీలైనంత సమీపంలో ఉండేలా బీజేపీ ప్రణాళిక రచించుకుంటున్నట్లు సమాచారం. మోదీతో పాటు ఇతర ముఖ్య నేతల పర్యటనల షెడ్యూల్నూ బీజేపీ నేతలు ఖరారు చేసే పనిలో పడ్డారు.ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో ఈసారి రెండంకెల సీట్లను సాధిస్తామంటోంది కాషాయదళం.
ఈ నెల 4న ఆదిలాబాద్లో, 5న సంగారెడ్డిలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. 15న మల్కాజ్ గిరిలో రోడ్ షో నిర్వహించగా16న నాగర్ కర్నూల్, 18న జగిత్యాలలో జరిగిన బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో మరోసారి మోదీ పర్యటనకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది.
ఈ సారి తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలను టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ. తెలంగాణలో సీనియర్ నేతలు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ వంటి ప్రముఖులు ఎంపీ బరిలో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే..