ఐపీఎల్ 2024లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ పలు రికార్డులు నెలకొల్పారు.ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున అత్యధిక సిక్సులు (241) బాదిన బ్యాటర్‌గా నిలిచారు. ఇప్పటివరకు ఈ రికార్డు గేల్(239) పేరిట ఉండేది. అలాగే టోర్నీ చరిత్రలో ఓవరాల్‌గా అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ల లిస్టులో ధోనీని(239) అధిగమించి 4వ స్థానానికి చేరుకున్నారు.
ఈ జాబితాలో గేల్(357), రోహిత్ (261), ఏబీ డివిలియర్స్(251) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. విరాట్ కోహ్లీ 2008 సంవత్సరంలో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోనే కొనసాగుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ అరుదైన రికార్డును సాధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో 1500 సిక్సులు బాదిన రెండో టీమ్‌గా ఆర్సీబీ నిలిచింది. ఇప్పటివరకు కేవలం ముంబై ఇండియన్స్ జట్టు మాత్రమే ఈ జాబితాలో ఉంది.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ దారుణంగా ఓడిపోయింది. ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు హోమ్ గ్రౌండ్‌లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. కానీ చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్ చేతిలో ఆర్సీబీ చతికిలపడింది. 183 పరుగుల టార్గెట్‌ను కేకేఆర్ 3 వికెట్లు కోల్పోయి 19 బంతులు ఉండగానే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్ల ముందు ఆర్సీబీ బౌలర్లు తేలిపోయారు. వెంకటేశ్ 50, నరైన్ 47, సాల్ట్ 30, శ్రేయస్ 39* పరుగులు చేశారు. అంతకుముందు కోహ్లీ 83 పరుగులతో రాణించడంతో ఆర్సీబీ 182 రన్స్ చేసింది.