TG Politics: కాంగ్రెస్లో చేరిన మానకొండూరు మాజీ ఎమ్మెల్యే

0
23

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవ హారాల ఇన్చార్జ్ దీపదాస్ మునీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రమంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబుల సూచన మేరకు పార్టీలో చేరుతున్నట్లు మోహన్ వెల్లడించారు. పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని బీజేపీ నాయకత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని, రాష్ట్ర బీజేపీలో ఎవరికివారే యమునా తీరు అన్నట్లు నాయకుల వ్యవహారం ఉండడంతో మనస్థాపనికి గురై పార్టీ మారుతున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడం కన్నతల్లి దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమక్కుమార్ రెడ్డి, ఏఐసీసీ సెక్రెటరీ రోహిత్ చౌదరి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మానకొం డూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అధిష్టానం నాకు ఏ బాధ్యత అప్పజెప్పినా నికార్సైన కార్యకర్తగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు గెలిచాల రాజేందర్ రావు, తీన్మార్ మల్లన్నతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

ఆరేపల్లి మోహన్ 2009 పునర్విభజనలో భాగంగా ఏర్పడిన మానకొండూర్‌ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలి ఎమ్మెల్యేగా ఎన్నికైయ్యారు. ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా పనిచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కాంగ్రెస్ పార్టీని విడి బీఆర్ఎస్ లో చేరారు. 2023లో బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.