ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారి ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు విడుదలైన తరువాత ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు ఇవాళ హైదరాబాద్‌కు చేరుకోనున్నట్లు సమాచారం. ఇవాళ స్పెషల్ టీమ్ ముందు హాజరవనున్నట్టు సమాచారం. ప్రభాకర్ రావును విచారించిన అనంతరం బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న సస్పెండై పోలీసు కస్టడీలో ఉన్నారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి సంధ్యా కన్వెన్షన్ ఎండీ సంధ్యా శ్రీధర్‌రావును నిన్న విచారించారు. ఫోన్‌ట్యాపింగ్ ద్వారా తనపై అక్రమకేసులు పెట్టారని శ్రీధర్‌రావు ఇప్పటికే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల పిలుపుతో శ్రీధర్‌రావు తన అడ్వొకేట్‌తో కలిసి బంజారాహిల్స్ పీఎస్‌కు వచ్చారు. శ్రీధర్ రావు ఫిర్యాదు ఆధారంగా స్పెషల్ టీమ్ పోలీసులు విచారించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఫోన్‌ట్యాపింగ్, తనపై బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని స్పెషల్ టీమ్ అధికారులకు ఇచ్చేందుకు పీఎస్‌కు వచ్చానని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా భుజంగరావు కూడా తనను ఇబ్బందులకు గురి చేశాడని తెలిపారు. ఆఫీసుకు పిలిపించి మరీ బెదిరించాడని శ్రీధర్‌రావు చెప్పారు.