కొందరు తొలి సినిమాతో ఆకట్టుకుంటారు. కొందరు ట్రైలర్ లో తళుక్కుమంటారు. కానీ… అరుదుగా కొందరు మాత్రమే ఫస్ట్ లుక్ తోనే కుర్రాళ్ల గుండెల్లో ఫసక్ అని గునపం దింపుతారు. అలాంటి తక్కువ మంది హీరోయిన్లలో ఆర్తి అగర్వాల్ ఒకరు. అంత బాగుంటుంది కాబట్టే కొద్దిరోజుల్లోనే టాప్ హీరోలతో సినిమాలు చేసిందామె.
దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీని ఊపు ఊపింది ఆర్తి అగర్వాల్. అనుష్క, శ్రియా, నయనతార వంటి స్టార్ హీరోయిన్లకు కాంపిటీషన్ ఇచ్చి అవకాశాలు అందుకుంది. యంగ్ హీరోల లవ్ స్టోరీలకు కేరాఫ్‌గా నిలిచింది. కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఆర్తి అగర్వాల్ ట్రాక్ తప్పింది. సినిమాలు తగ్గిపోయాయి. అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఒక్కసారిగా ఆమె డౌన్ అయిపోయింది. అంతలోనే కనుమరుగయ్యింది. ఆర్తి అగర్వాల్ 2015 జూన్ 6న కన్నుమూసింది.
మార్చి 5 ఆర్తి అగర్వాల్ జయంతి. సోషల్ మీడియా ఈ సందర్భంగా ఆమెను గుర్తుచేసుకుంది. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో 2001లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. నువ్వు లేక నేను లేను, అల్లరి రాముడు, ఇంద్ర, నీ స్నేహం, పల్నాటి బ్రహ్మనాయుడు, వసంతం, అడవి రాముడు, వీడే, నాగార్జున, సోగ్గాడు, అందాల రాముడు వంటి ఎన్నో సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ఐదారేళ్లు ఆమె కెరీర్ పీక్‌లో నడించింది. పర్సనల్ లైఫ్ లో మెయిన్ గా ప్రేమ ఆమెను ఒత్తిడిలో పడేసింది.
తరుణ్ తో ఆమె వరుసగా రెండు సినిమాలు చేసింది. నువ్వు లేక నేను లేను సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. ప్రేమ కారణంగా ఇద్దరు సినిమాలు చేయలేదు. అవకాశాలు కూడా తగ్గాయి. పెద్దలు కలగజేసుకుని కండిషన్లు పెట్టినట్టు టాక్. ఆ తర్వాత ఇద్దరి కెరీర్ గాడి తప్పింది. ఈ ఎపిసోడ్ తర్వాత తండ్రి ఆమె లైఫ్ లో ఎక్కువగా కలగజేసుకోవడం మొదలుపెట్టాడట. సినిమా షూటింగ్ లకు వచ్చి కండిషన్లు పెట్టేవాడట. హీరోయిన్ గా ఆర్తికి ఆమె తండ్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాడు కాదని ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. ఆర్తి ఇబ్బంది పడేది.. సరైన పెర్ఫామెన్స్ ఇవ్వలేకపోయేదని అన్నారాయన. సినిమాలు తగ్గడం.. ప్రేమ ఫెయిల్ కావడం.. తండ్రి కండిషన్లు పెట్టడం.. ఇలా.. తను బతకడం ఎందుకు అనుకుని ఆర్తి 2005లో సూసైడ్ అటెంప్ట్ చేసిందని ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా చెబుతారు. కోలుకున్నాక వైవాహిక జీవితం మొదలుపెట్టినా అది ఎంతో కాలం సాగలేదు. ఆరోగ్యం సహకరించక, బరువు పెరిగిపోయి.. 2015లో హార్ట్ ఎటాక్ తో ఆర్తి కన్నుమూసింది. ఈ సందర్భంగా ఆర్తి అగర్వాల్ పాటలు వింటూ ఆమె అందం చూస్తూ నివాళి అర్పిస్తున్నారు ఆమె ఆరాధకులు.