Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ ఆస్తి విలువ ఎంతంటే?

0
30

ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఒక ఆర్థిక మంత్రి దగ్గర డబ్బు లేదు అన్న మాటలు కొందరికి ఆశ్చర్యాన్ని కలిగించినప్పటికీ.. అది నిజమే అని తాజాగా వెల్లడైన కొన్ని విషయాల ద్వారా తెలుస్తోంది. 2022లో నిర్మల రాజ్యసభ ఎంపీ నామినేషన్‌ ప్రకారం.. ఆమెకు రూ.1.87 కోట్ల స్థిరాస్తులు, రూ.65.55 లక్షల చరాస్తులు ఉన్నాయి. రూ.26.91 లక్షల అప్పు ఉంది. ఇది రెండేళ్ల క్రితం నాటిది. ప్రస్తుతం ఆస్తి విలువ కొంతమేర పెరిగే అవకాశం ఉంది.

నిర్మలా సీతారమన్, ఆమె భర్త పరకాల ప్రభాకర్ కు హైదరాబాద్ సమీపంలోని మంచిరేవులలో రెసిడెన్షియల్ బిల్డింగ్ ఉంది. 2016 నుంచి 2022 నాటికి దీని విలువ రూ. 99.36 లక్షల నుంచి రూ. 1.7 కోట్లకు పెరిగింది. అలాగే కుంట్లూరులో రూ. 17.08 లక్షలు విలువ చేసే వ్యవసాయ భూమి ఉంది. 2016 లో దీని విలువ రూ. 16.02 లక్షలు. 2022 అఫిడవిట్ ప్రకారం నిర్మలా సీతారామన్ వద్ద ఒక స్కూటర్ ఉంది. ఆమెకు సొంతంగా కారు లేదు.

2016, 2022 లో నిర్మల డిక్లరేషన్ల ప్రకారం ఆమెకు సొంత కారు లేదు. కేవలం రూ. 28,200 తో కొనుగోలు చేసిన బజాజ్ చేతక్ స్కూటర్ ఉంది. 2016లో ఆమె వద్ద 315 గ్రాములు లేదా 31.5 తులాల బంగారం ఉంది. అప్పుడు దీని విలువ రూ. 7.87 లక్షలు. కానీ బంగారం ధర భారీగా పెరగడంతో 2022 నాటికి దీని విలువ రూ. 14.49 లక్షలకు పెరిగింది. ఇప్పటికీ ఇంతే మొత్తంలో బంగారం కలిగి ఉంటే దాని విలువ ప్రస్తుత మార్కెట్ ప్రకారం 22 క్యారట్ల బంగారం అయితే రూ. 19.4 లక్షలు, 24 క్యారట్ల బంగారం అయితే రూ. 21.18 లక్షలకు పెరుగుతుంది.