ఎండల తీవ్రత పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలు డీహైడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా చర్యలు ముమ్మరం చేస్తోంది. ఎండల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించనుంది. ఇప్పటికే అన్ని జిల్లాలకు ORS ప్యాకెట్లు, IV ఫ్లూయిడ్స్, ఇతర మందులను పెద్ద మొత్తంలో పంపిణీ చేసింది. ఇవి ఆశా కార్యకర్తలు, ఉపాధి హామీ పనుల కేంద్రాల వద్ద అందుబాటులో ఉండనున్నాయి.
మరో వైపు ఏప్రిల్, మే నెలల్లో ఎండలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ రెండు నెలల్లో ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో టెంపరేచర్లు 45 డిగ్రీలకు చేరవచ్చని, వడగాలులు వీచే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో వడదెబ్బ, డీ-హైడ్రేషన్ కు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా, అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందుజాగ్రత్త చర్యలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, ధాన్యం కొనుగోలు అంశాలపై కలెక్టర్లతో నిన్న ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ముందుజాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.