Ravi Kota Takes Charge As Chief Secretary Of Assam: తెలుగు వ్యక్తికి అస్సాం ప్రభుత్వలో కీలక పదవి

0
26

అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఓ తెలుగు వ్యక్తి అపాయింట్ కావడం హైలైట్ గా చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కోటపాడు గ్రామానికి చెందిన ఐఏఎస్ అధికారి రవి కోత అస్సాం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆ రాష్ట్ర 51వ ప్రధాన కార్యదర్శిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.

అస్సాం-మేఘాలయ కేడర్‌కు చెందిన 1993 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి రవి మార్చి 31 ఆదివారం తన బాధ్యతలను స్వీకరించారు. పబన్ కుమార్ బోర్తకూర్ పదవీ విరమణ తర్వాత ఆయన స్థానంలో ఉన్నారు. ఏప్రిల్ 12, 1966లో జన్మించిన రవి 30 ఏళ్ల పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు.

రవి వాషింగ్టన్ డీసీ, యూఎస్‌ఏలోని భారత రాయబార కార్యాలయంలో ఆర్థిక విభాగానికి అధిపతిగా కూడా పనిచేశాడు. భారతదేశం – అమెరికా దౌత్య సంబంధాలు, భాగస్వామ్యాలపై విస్తృతంగా పనిచేశారు. 15వ ఆర్థిక సంఘానికి జాయింట్ సెక్రటరీగా ఉన్న సమయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరిస్తూ ముఖ్యమైన నివేదికలను సమర్పించారు. పబ్లిక్ ఫైనాన్స్, స్థూల ఆర్థిక విధానాల రూపకల్పనలో రవి కీలక పాత్ర పోషించారు. అస్సాం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి డాక్టరేట్ కూడా రవినే.