BREAKING : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు

0
33

ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల అధికారులకు నామినేషన్ల దాఖలు చేసిన సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో పూర్తి సమాచారం ఇవ్వకుండా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ పేర్కొంటూ.. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి‎లు హైకోర్టులో పిటిషన్లను దాఖలు చేసి కేసులు వేశారు.

గత ఏడాది 2023 డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పైడి రాకేష్ రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండవ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, మూడవ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఆశన్న గారి జీవన్ రెడ్డిలు నిలిచారు. అంతకుముందు ఎన్నికల నామినేషన్‎లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారంటూ కాంగ్రెస్ నాయకుడు అప్పటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రాకేష్ రెడ్డిపై దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆస్తుల విలువను తక్కువ చేసి చూపించారని.., హైదరాబాద్‌లోని వ్యవసాయ క్షేత్రంలో నిర్మించిన గోడౌన్ గురించి అఫిడవిట్‎లో ప్రస్తావించలేదని తెలిపారు. ఎన్నికల సమయంలో వాడిన ఐదు వాహనాలపై గతంలో విధించిన జరిమానాలు చెల్లించకుండానే వినియోగించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిపై ఇంకొక అప్పీల్ వేసి పిటిషన్ దాఖలు చేసి కేసు వేశారు. ఎన్నికల అధికారులకు ఇచ్చిన అఫిడవిట్‌లో కేసుల విషయం చూపలేదని జీవన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి‌పై పోటీ చేసి ఓటమి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రొద్దుటూరి వినయ్ రెడ్డి, ఆశన్న గారి జీవన్ రెడ్డిలు వేరువేరుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి కేసులు వేయడం ఆర్మూర్లో చర్చనీయాంశమైంది. ఈ రెండు పార్టీల ఇద్దరు నాయకులు ప్రస్తుత ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై హైకోర్టులో పిటిషన్‌లు వేయడం గురించి ఆర్మూర్ ప్రాంతంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇరువురు నాయకులు దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వనుందో అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.