వెలిగొండ ప్రాజెక్టుతో దశాబ్ధాల కల నెరవేరిందని ఏపీ సీఎం జగన్ అన్నారు. టన్నెల్‌లో ప్రయాణించినప్పుడు సంతోషంగా అనిపించిందని చెప్పారు. బుధవారం ఆయన వెలిగొండ ప్రాజెక్ట్‌ను జాతికి అంకితం చేశారు. అద్భుతమైన ప్రాజెక్టును పూర్తి చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు.. మా నాన్న ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని చెప్పిన జగన్ …తాను పూర్తి చేశానని వెల్లడించారు.
వైఎస్‌ఆర్ కొడుకుగా ప్రాజెక్టును పూర్తి చేయడం గర్వంగా ఉందని .. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్- అని చెప్పుకొచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుతో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో మెట్ట ప్రాంతాలకు 4 లక్షల 47వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు వలన 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందని జగన్ తెలిపారు.
వెలిగొండ ప్రాజెక్ట్ విశేషాలు ఇవే..
2004లో జలయజ్ఞంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పశ్చిమ ప్రాంతానికి వెలిగొండ ప్రజెక్ట్ కేటాయించారు.
2005 అక్టోబరులో శిలాఫలకంవేసి వైఎస్ఆర్ పనులు ప్రారంభించారు.
సహజసిద్ధంగా ఏర్పడిన కొండల నడుమఉన్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద మూడు వాటర్ స్టోరేజ్ పాయింట్ల వద్ద కాంక్రీట్ డ్యాముల నిర్మాణం చేశారు.
ఫీడర్ కెనాల్ 21.8కి.మీ, తీగలేరు 48.30కిలో మీటర్లు, గొట్టిపడియ కెనాల్ 11.40కిలో మీటర్ల కాలువల తవ్వకాలు పూర్తయ్యాయి.
తూర్పు ప్రధాన కాలువ మొత్తం 130.82 కిలో మీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి.
ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెడ్ రెగ్యూలేటర్ ఏర్పాట్లు 2018లో పూర్తయ్యాయి.
శ్రీశైలంలోని కృష్ణా జలాలను తరలించేందుకు నల్లమల భూగర్భంలో దోర్నాల మండలం కొత్తూరు నుండి కృష్ణా నదిలోని కొల్లంవాగు వరకు 18.89కి.మీ మేర రెండు సమాంతర సొరంగాల తవ్వకాలు జరిగాయి.
ఇందులో మొదటిది 7మీటర్ల వ్యాసార్ధం, రెండవది 9.2 మీటర్ల వ్యాసార్ధంతో తవ్వకాలు జరిపారు.
జర్మనీ నుండి దిగుమతి చేసుకున్న అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మిషన్ల (టీబీఎం) సహాయంతో తవ్వకాలు చేశారు.
వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ ను నవంబర్ 2021లో, రెండో టన్నెల్ ను జనవరి 2024లో పూర్తయింది.
పశ్చిమ ప్రాంత వరప్రదాయినిగా ఫ్లోరైడ్ ప్రభావిత, మెట్ట ప్రాంతాలైన 30 మండలాల్లో 15.25 లక్షల జనాభాకు త్రాగునీరు, 4లక్షల 47వేల 300 ఎకరాలకు సాగునీరు ప్రాజెక్టు ద్వారా అందించనున్నారు.
ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 10,010.54 కోట్లు.
ప్రకాశం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల్లోని 30 మండలాలకు లబ్ధిచేకూరనుంది.
మొదటి దశ లో (కెనాల్ డిస్ట్రిబ్యూటరీ) ప్రకాశం జిల్లా పరిధిలోని 1,19,000 ఎకరాలకు సాగు నీరు, 4 లక్షల మందికి త్రాగు నీరు.
రెండవ దశ (కెనాల్ డిస్ట్రిబ్యూటరీ)లో ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల పరిదిలోని 3,28,300 ఎకరాలకు సాగు నీరు, 11.25 లక్షల మందికి త్రాగు నీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
నల్లమల సాగర్ రిజర్వాయర్ సామర్థ్యం 53.85 టీఎంసీలు.