KCR : కేసీఆర్‌కు నోటీసులు?.. కమిషన్ ముందు హాజరుకాక తప్పదా?

0
25

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్‌ను జ్యుడీషియల్ కమిషన్ ప్రశ్నించనున్నదా? ఫస్ట్ టర్ములో ఇరిగేషన్ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు సైతం విచారణ ఎదుర్కోక తప్పదా? కమిషన్ ముందు హాజరయ్యేలా వారికి సమన్లు జారీ కానున్నాయా? అధికారులు, ఇంజినీర్లను ప్రశ్నించనున్నట్టుగానే వీరిద్దరినీ ఎంక్వయిరీ చేయనున్నదా? ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై వారి వివరాలను సైతం తెలుసుకోనున్నదా? వారిచ్చే సమాధానాలను ఫైనల్ రిపోర్టులో ప్రస్తావించనున్నదా? ఇలాంటి అనేక సందేహాలకు అవుననే సమధానాలే వినిపిస్తున్నాయి. కమిషన్ చైర్మన్‌గా ఉన్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేరుగా వారిద్దరి పేర్లను ప్రస్తావించకపోయినా, నోటీసులు ఇస్తామని చెప్పకపోయినా ఎంక్వయిరీ ప్రాసెస్‌లో వారిని ప్రశ్నించే అవకాశమున్నదనే సంకేతాలు అందాయి. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మొదటిసారి రాష్ట్రానికి వచ్చారు. బీఆర్‌కేఆర్ భవన్‌లోని 8వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఆఫీసులో రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఆ శాఖ స్పెషల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఇంజనీర్-ఇన్-చీఫ్‌లు అనిల్ కుమార్, నాగేంద్ర తదితరులతో మాట్లాడారు. అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను చూశారు. అవసరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

మీడియా ప్రతినిధులతో గురువారం ఆయన చిట్‌చాట్ నిర్వహించారు. కేసీఆర్, హరీష్‎రావులను ఎంక్వయిరీకి పిలుస్తారా?… వారిని ప్రశ్నిస్తారా?… అని ఈ సందర్భంగా కొందరు పాత్రికేయులు ఆయనను అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ ‘ముఖాలను చూసి విచారణ చేయం. లీగల్ అంశాల ఆధారంగానే విచారణ కొనసాగుతుంది. బ్యారేజీలతో సంబంధం ఉన్న అందరినీ కలుస్తాం. కావాల్సిన సహాయక సహకారాలను తీసుకుని విచారణ చేస్తాం. లీగల్ సమస్యలు తలెత్తకుండా ఉండేలా విచారణ కొనసాగిస్తాం. నిర్మాణ సంస్థల ప్రతినిధులతో పాటు అవసరమైతే రాజకీయ నాయకులకు సైతం నోటీసులు ఇవ్వాల్సి వస్తే ఇస్తాం.’ అంటూ రిప్లయ్ ఇచ్చారు. లీగల్ అంశాలను పరిగణనలోకి తీసుకోకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చే అవకాశముంటుందని.., న్యాయస్థానాల నుంచి స్టే వచ్చే చాన్స్ సైతం ఉంటుందని.., అందువల్ల అన్ని జాగ్రత్తలూ తీసుకుంటామని స్పష్టం చేశారు. అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా విషయాలు అవగాహనకు వచ్చాయని తెలిపారు.

స్వతహాగా తాను ఇంజినీర్‌ను కానందువల్ల ఆ రంగంలో నిపుణులైనవారిని కన్సల్ట్ చేయాల్సి వస్తుందన్నారు. విచారణ ప్రక్రియలో నిపుణుల అభిప్రాయాలను తీసుకోవడం సైత ఒక భాగమని వివరించారు. ఇంజినీర్లతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులతోనూ త్వరలో సమావేశమవుతామని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. బ్యారేజీలకు డ్యామేజ్ జరిగిన తర్వాత ఫీల్డు స్థాయిలో స్టడీ చేసిన డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చిన నివేదికతో పాటు రాష్ట్ర విజిలెన్స్ కమిటీ ఇచ్చిన నివేదికను, ‘కాగ్’ చేసిన అధ్యయన రిపోర్టును సైతం పరిగణనలోకి తీసుకుంటామన్నారు. నివేదికల ఆధారంగానే విచారణ కొనసాగుతుందన్నారు. అవసరమైతే మరోసారి ఎన్డీఎస్ఏతోనూ భేటీ అవుతామని వెల్లడించారు.

అలానే కాళేశ్వరం ప్రాజెక్టులపై రాష్ట్రంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నందున ప్రజల నుంచి ఫిర్యాదులను సైతం స్వీకరిస్తామన్నారు. ఫిర్యాదులు, అభిప్రాయాలను తెలియజేయడానికి ఓపెన్‌గానే ప్రకటన చేస్తామని తెలియజేశారు. ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడం సైతం ఈ ఎంక్వయిరీ ప్రాసెస్‌లో ఒక భాగంగా ఉంటుందన్నారు. అనేక టెక్నికల్ అంశాలను లోతుగా విశ్లేషించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. బ్యారేజీ నిర్మాణంతో సంబంధం ఉన్న అందరినీ కలుస్తామని తెలిపారు. కావాల్సిన సహాయ సహకారాలను తీసుకొని విచారణ చేస్తామన్నారు. సెకండ్ విజిట్‌లో స్వయంగా తమ కమిషన్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లను సందర్శిస్తుందని స్పష్టం చేశారు. రిపోర్టుల్లో పేర్కొన్న అంశాలతో పాటు నిపుణులతో చర్చించేటప్పుడు వీటిపై సలహాలు తీసుకుంటామని తెలిపారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు రూపొందించడానికి నెలల తరబడి మేధస్సును వినియోగించామని.., కొన్ని వేల గంటల పాటు బుర్రను కరిగించామని.., మేధోమధనం చేశామని గతంలో కేసీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో మాత్రం.. ” ప్రాజెక్టుల నిర్మాణానికి ఆలోచనలు ఇచ్చే స్ట్రాటెజిస్టులుగా మాత్రమే పొలిటీషియన్స్ వ్యవహరిస్తారు. డిజైన్ లాంటి వ్యవహారాలన్నీ ఇంజినీర్లు చూసుకుంటారు. ఆ డిజైన్‌తో మాకు ఏమాత్రం సంబంధం లేదు.. కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని ‘వ్యాప్కోస్’ సంస్థ రూపొందించింది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో డిజైన్, ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ తదితర అంశాల్లో ఇంజినీర్లు, అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఇచ్చే వివరాలకు అనుగుణంగా కేసీఆర్, హరీష్‎రావును సైతం ఎంక్వయిరీకి పిలిచి వారి వివరణ తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.