CM REVANTH : కేరళ సీఎంను రేవంత్ తిట్టినా.. ఇక్కడి కమ్యూనిస్టులు మద్దతిస్తున్నారు- కేటీఆర్

0
20

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నుంచి వెళ్లిన వాళ్ళను కాంగ్రెస్ కార్యకర్తలు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారితే గౌరవం ఉండదని స్వయంగా ఈటల రాజేందర్ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు ఉంటాయని అన్నారు. పార్టీ మారిన వారిని ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోము అని తెగేసి చెప్పారు. మా పార్టీ నుండి బయటకు వెళ్లిన వారు పోటీ చేస్తున్న స్థానాల్లో ఫోకస్ పెడతామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేని పార్టీలు దేశంలో 13 ఉన్నాయని అన్నారు. ఓట్లు వేయకపోతే ఫ్రీ బస్సు ఎత్తివేస్తామని రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని కచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాలు నారాజ్‌గా ఉన్నారు. సిరిసిల్లలో మళ్లీ ఆత్మహత్యలు మొదలు అయ్యాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గొర్రెల పంపిణీ స్టార్ట్ చేస్తామని చెప్పారు. బీజేపీకి కేంద్రంలో అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇచ్చాము. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో రాజీ పడిందని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ జరిగిందా? లేదా అనేది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ కేరళలో సీపీఎంను తిడుతున్నారు.. దేశంలో మిగతా ప్రాంతాల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకున్నారు.. అసలు రాహుల్ గాంధీకి స్పష్టమైన వైఖరి లేదని సెటైర్ వేశారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను రేవంత్ రెడ్డి బండ బూతులు తిట్టారు.. అయినా ఇక్కడి సీపీఎం నేతలు కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.