పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తాజాగా సోషల్ మీడియాలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచే ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో యాక్టీవ్‌గా ఉంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, బస్సు యాత్రపై కేసీఆర్ ట్వీట్ చేయగా.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కేసీఆర్ తొలి ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. తను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందన్నారు. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని తెలిపారు. తనతో పాటు ఉన్న మాజీ శాసనసభ్యులు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పది సార్లు కరెంటు పోతున్నదని.. ఈ సందర్భంగా తనకు చెప్పారన్నారు కేసీఆర్. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? అని రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని పేర్కొన్నారు.