TELANGANA: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 17.49 కోట్ల నగదు సీజ్

0
12

తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దాదాపు 42 రోజుల వ్యవధిలో హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్‌లు, స్టాటిస్టిక్ సర్వైలెన్స్ టీమ్‌లు దాడులు, తనిఖీలు నిర్వహించారు. వాటిలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న దాదాపు రూ. 17.49 కోట్ల నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. గత నెల 16 నుంచి ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 21 వేల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని 241 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. గడిచిన ఒక్కరోజు వ్యవధిలోనే దాదాపు రూ. 82.40 లక్షల నగదును సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గత 24 గంటల్లో రూ. 82,40,200 నగదు, రూ. 11,19,473 వివిధ రకాల ఇతర వస్తువులు, 60.89 లీటర్ల మద్యంతో పాటు 4 కేసులు నమోదు చేసి నలుగురుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు రూ. 17.49 కోట్ల నగదును, రూ. 7.45 కోట్ల విలువైన ఇతర వస్తువులు, 21,399.5 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు, ఇప్పటి వరకు 241 మంది‌పై మద్యం కేసులు నమోదు చేసి, 239 మందిపై కేసులు పెట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 3022 లైసెన్స్ ఆయుధాలను డిపాజిట్ చేశారని తెలిపారు. ఈ నెల 29న మధ్యాహ్నం 3 గంటలలోపు పార్లమెంట్ స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితా ఖరారు కానున్నందున.. ఆ తర్వాత ప్రచారం ముమ్మరం అవుతున్నందున నిఘా మరింత ముమ్మరం చేసి.. కోడ్ ఉల్లంఘించిన వారిపై కొరడా ఝుళిపించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.