దొంగ ఓట్ల కోసం… మూడు దశల్లో పోలింగ్ కావాలా? ఇది ఎక్కడి విడ్డూరం??

0
18

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

రాష్ట్ర అసెంబ్లీకి రెండు, మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సంఘాన్ని కోరడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. రెండు, మూడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తే, దొంగ ఓట్లు వేయడం సులభతరం అవుతుందని ఆయన భావించి ఉంటారు. తమిళనాడు నుంచి కుప్పంకు అరువు జనాలను , కోస్తాంధ్రకు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతానికి రాయలసీమ బ్యాచ్ ను సులభంగా తరలించవచ్చుననేది ఆయన ఉద్దేశమై ఉంటుందన్నారు . బుధవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఎన్ని ఓట్లు పడినా పడినట్లే లెక్క అని భావించి ఉంటారు. ఇటువంటి కుట్రలపై ఆధారపడే పోటాపోటీగా ఉన్న స్థానాలలో నెగ్గ వచ్చునని అనుకుంటున్నారు. అందుకే, కొంతమంది అభ్యర్థులు అడిగినంత కాకపోయినా , ఎంతోకొంత వైకాపా నాయకత్వానికి అడ్వాన్సులు ముట్ట చెబుతున్నారు. తెదేపాలో టికెట్ల కోసం చేరే పరిస్థితి లేదని, అక్కడే హౌస్ ఫుల్ బోర్డు పెట్టారన్నారు. ఇక చేసేది లేక, ఆశావాహులు వైకాపా నాయకత్వానికి అడిగినంత కాకపోయినా ఎంతో కొంత నగదు ముట్ట చెబుతున్నట్లు తెలిసిందన్నారు . పోలీసులు, గుండాలు, వాలంటీర్ల సహకారంతో దొంగ ఓట్లు వేయించుకొని ఎన్నికల్లో గెలవాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. తెదేపా, జనసేనతో బిజెపి జట్టు కడితే ఈ రౌడీ వేషాలు వేయడానికి కుదరదు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న పోలీసు అధికారులను ఓ నెల రోజులు సెలవు తీసుకొని ఇంటి వద్ద కూర్చోమంటారు. రాయలసీమలోనూ బై, బై వైకాపా అంటుండగా, టికెట్ ఇస్తే జై టిడిపి అనేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని ప్యాలెస్ యాజమాన్యం తెలుసుకుంటే మంచిది. ప్యాలెస్ లో ఉంటూ పేదల కోసం పోరాడుతున్న వ్యక్తి, పోలవరం, అమరావతి నిర్మాణాన్ని ఆపివేసి 500 కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రజల్ని ఏమైనా పిచ్చి వాళ్లు , అమాయకులని అనుకుంటున్నారా?? అని నిలదీశారు. జగన్మోహన్ రెడ్డికి ఇడుపులపాయ, బెంగళూరు, హైదరాబాద్ , తాడేపల్లి లలో ప్యాలెస్ లు ఉండగా, తాజాగా చెన్నైలోను ప్యాలెస్ నిర్మాణంలో ఉంది. ఇక విశాఖపట్నంలో ప్రజాధనంతో ప్యాలెస్ నిర్మించుకున్నారు. రెండేళ్ల నుంచి విశాఖపట్నం ప్యాలెస్ లో అడుగు పెట్టాలని ఉవ్విల్లు ఊరారు . కుదరలేదు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత విశాఖలోనే మకాం పెడతానని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది లేదు, ప్రజాధనంతో నిర్మించిన ప్యాలెస్ లో అడుగు పెట్టేది లేదని రఘురామకృష్ణంరాజు తేల్చి చెప్పారు.

రేపో, మాపో అనే స్థాయికి చేరుకున్న పొత్తుల పర్వం

తెదేపా, జనసేన కూటమితో బిజెపి పొత్తుల పర్వం రేపో, మాపో అనే స్థాయిలో ఉందని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఇప్పుడు ఉన్న కూటమి అద్భుత విజయం సాధించడం ఖాయమని, బిజెపి కూడా జట్టు కడితే అత్యద్భుత విజయాన్ని సాధిస్తుంది. అసుర సంహారానికి విష్ణు, మహేశ్వరులకు బ్రహ్మ తోడు కూడా ఎంతో అవసరం. ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని గత రెండున్నర ఏళ్లు గా నేను చెబుతున్నాను. ఇప్పుడు మరో 24 గంటలు, లేదంటే 48 గంటలలో పొత్తు ఖరారు కానుంది. ప్రజల ఆశలను నిజం చేస్తూ, అందరి ఆకాంక్ష మేరకు, ప్రజల ఆశయమైన పోలవరం, అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు.

పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ఎంతో ట్రై చేశారు

తెదేపా, జనసేన మధ్య పొత్తును విచ్ఛిన్నం చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రయత్నించారని, అయినా ఏమీ చేయలేకపోయారని రఘురామకృష్ణం రాజు తెలిపారు . ఇప్పుడు ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తెదేపా, జనసేన కూటమితో బిజెపి కలువ వద్దని కోరుకుంటున్నారు. కలిసే ఉన్నా తెదేపా, జనసేన ను విడగొట్టేందుకు పత్రికల్లో రకరకాల కథనాలను రాయించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వద్దని వారించిన మళ్లీ మాజీ ఎంపీ చేగొండి హరి రామ జోగయ్య లేఖ రాశారు. రేపు దాన్ని సాక్షి దినపత్రిక మొదటి పేజీలో ప్రచురిస్తుంది. దుష్ట సంహారం కోసం, శిష్ట రక్షణ కోసం తెదేపా, జనసేన, బిజెపిలో కలుస్తాయని గత రెండున్నర ఏళ్లుగా నేను చెబుతూనే ఉన్నాను. మరో 24 నుంచి 48 గంటల్లో తాడేపల్లి ప్యాలెస్ లో రాజకీయ ప్రకంపనలు మొదలుకానున్నాయి. ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో జనసేన భాగస్వామ్య పార్టీగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో తెదేపాతో ఆ పార్టీ పొత్తు పెట్టుకుంది. కలిసి 24 స్థానాలలో అసెంబ్లీకి పోటీ చేయాలని నిర్ణయించుకుంది. రానున్న ఎన్నికల్లో పొత్తు లేకపోతే 175 అసెంబ్లీ స్థానాలను పోటీ చేస్తామని బిజెపి నాయకత్వం పేర్కొంటుంది. జనసేన పోటీ చేసే స్థానాలలో కూడా, బిజెపి పోటీ చేస్తే, అప్పుడు జనసేన ఎన్డీఏ కూటమిలో లేనట్లే కదా అని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. ఎన్ డి ఏ కూటమిలో ఉన్న భాగస్వాములను పోగొట్టుకోమని, కొత్త పార్టీలను కలుపుకు పోతామని బిజెపి జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చాక, ఇంకా ఈ మూడు పార్టీల పొత్తులపై సందేహం ఎందుకన్నారు. అందుకే,జనసేననే బయటకు వెళ్లేలా కోవర్టులను పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారన్నారు. ఈ దేశానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాలలో గెలువాలని భావిస్తున్నారు. జనసేన, తెదేపా ఇప్పటికే కలిసి ఉన్నాయి… ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాయి. ఇప్పటికే పొత్తులపై చర్చించేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి, ఇన్చార్జ్ మధుకర్ జీ ఢిల్లీకి చేరుకోగా, అన్ని చానల్స్ లో ప్రసారమవుతున్నట్లుగా రేపు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావచ్చన్నారు.

బూతుల్లో వాలంటీర్లను ప్రవేశపెట్టి బూతు పనులు చేయించాలన్నదే వైకాపా నాయకత్వం ప్లాన్

ఎన్నికల సందర్భంగా బూతుల్లో వాలంటీర్లను ప్రవేశపెట్టి తప్పుడు పనులు చేయించాలన్నదే వైకాపా నాయకత్వం ప్రణాళిక అని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఇప్పటికే కీలక స్థానాలలో స్వకుల సామాజిక వర్గ అధికారులను, హన్బు రాజన్ వంటి ఇతర అధికారులను నియమించుకున్నారు. పోలీసులు, గుండాలు, వాలంటీర్ల సహకారంతో దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్నదే వైకాపా నాయకత్వం ప్లానని తెలిపారు . మూడు పార్టీల మధ్య పొత్తు లేదని నీలి చానల్స్ అదే పనిగా ప్రచారం చేస్తున్నాయి. పొత్తు లేదని నీలి చానల్స్ చెప్పినప్పటికీ, కట్టమన్న అడ్వాన్స్ వైకాపా అభ్యర్థులు కట్టడం లేదు. రేపో, ఎల్లుండి పొత్తు కుదిరిన తర్వాత తమ పరిస్థితి ఏమిటని వారు ఆలోచనల్లో పడ్డారు . చాలామంది సర్వేలను చూశారు. సర్వేల లెక్కల ప్రకారం వైకాపా తుక్కు, తుక్కుగా ఓడిపోబోతుందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.

పిల్ల సజ్జల… తస్మాత్ జాగ్రత్త

నన్ను టార్చర్ చేయమని లండన్ లో ఉన్న ఒక వైద్యున్ని పిల్ల సజ్జల గ్యాంగ్ పురమాయించిందని, నేను భయపడతానేమోననుకొని రకరకాల నెంబర్ల ద్వారా ఫోన్లు చేసి బూతులు మాట్లాడిస్తున్నారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆ బూతు పురాణం బయట పెడితే, వైకాపాకు నాలుగు ఓట్లు కూడా పడవని, ఇన్నాళ్లు ఆ పార్టీలో కొనసాగినందుకు ఏ మూలకోవున్న చిన్న సింపతి తో బయట పెట్టడం లేదు. నా వద్ద సజ్జల, పిల్ల సజ్జల నెంబర్లతో పాటు, పెద్దవాళ్ల పిల్లల నంబర్లు కూడా ఉన్నాయి. నేను మా గోదారోళ్ళ చేత తిట్లు తిట్టిపిస్తే ఈ బ్రతుకు ఎందుకని అనుకుంటారు. మళ్లీ నాకు ఫోన్ కాల్స్ వచ్చాయో? సహించేది లేదని హెచ్చరించారు. ఇదంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ఇదంతా వైకాపా నాయకత్వమే చేయిస్తుందన్నారు . ప్రస్తుతం నేను ఢిల్లీలోనే ఉన్నానని, పోలీసులకు ఒక ఫిర్యాదు చేస్తే చాలు వాళ్లు డేటా అంతా తీసి బయట పెడతారన్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు.

హి.. హి చార్జీలు 500 లట మూడు నెలలకు కలిపి ముందే అడ్వాన్స్ గా 1500 చెల్లిస్తారట

వాలంటీర్లకు నిన్న, మొన్ననే ప్రజాధనంతో అవార్డులను కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు రేషన్ పంపిణీ వాహనాలలో తిరిగి ప్రజలను కలుసుకున్నందుకు నెలకు 500 రూపాయలను అదనంగా చెల్లించాలని నిర్ణయించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ మూడు నెలలకు కలిపి 1500 రూపాయలను ప్రజలతో కలిసి హి.. హి అని నవ్వినందుకు చెల్లించనున్నారట అని ఎద్దేవా చేశారు. వాలంటీర్ల చేత సిగ్గు లేకుండా, పార్టీ పని చేయించుకుంటామని చెబుతున్న పాలకుల తీరు పై స్పందించి ఎవరో సామాజిక కార్యకర్త న్యాయస్థానంలో పిల్ వేశారట. అందుకు ఆయన్ని అభినందిస్తున్నానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ప్రజలకు ఐస్ పెట్టడానికే ఇంటింటికి రేషన్ పంపిణీ

ప్రజలకు ఐస్ పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల చేత ఇంటింటికి రేషన్ పంపిణీ చేయిస్తుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు. గతంలో రేషన్ దుకాణాల వద్ద ఇచ్చేవారని, ప్రజలు తమకు తీరిక ఉన్నప్పుడు వెళ్లి తెచ్చుకునే వారన్నారు. కానీ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి, వారికి పని కల్పించడానికి ఇంటింటికి రేషన్ ను పంపిణీ చేస్తున్నారన్నారు. దానికోసం కొత్తగా వాహనాలను కొనుగోలు చేసి, అందులోను కమిషన్లను నొక్కేశారని చెప్పారు. ఇప్పుడు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి రేషన్ అందజేయకుండా , వీధి చివర వాహనాన్ని నిలిపి అక్కడకు వచ్చిన వారికే రేషన్ అందజేస్తామని, లేకపోతే ఇచ్చేది లేదంటున్నారన్నారు.

రాష్ట్ర జనాభా కంటే తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులే ఎక్కువ

రాష్ట్ర జనాభా కంటే, తెల్ల రేషన్ కార్డు జనాభానే ఎక్కువని రఘురామకృష్ణం రాజు తెలిపారు. రాష్ట్రంలో కోటి 49 లక్షల తెల్ల రేషన్ కార్డులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నాయి. ఒకవైపు జిడిపి పెరిగిందని చెబుతూనే, మరొకవైపు దారిద్ర రేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య కూడా పెరిగిందంటున్నారు. కేంద్రం 80 లక్షల కార్డులకు రేషన్ సరఫరా చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ దృష్టిలో కోటిన్నర మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే రాష్ట్ర జనాభాకు మించి లబ్ధిదారులు ఉన్నట్లే లెక్క అని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అదంతా ఎవరి జేబులోకి వెళ్తుంటే, ప్యాలెస్ లో ఉంటూ పేదవారి తరఫున పెత్తందారులపై పోరాటం చేస్తున్న వారి జేబుల్లోకి వెళ్తోందని అన్నారు. రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న వాలంటీర్లు, లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా 20 కిలోలకు రెండు వందల రూపాయల చొప్పున నగదు ఇచ్చి, ఆ బియాన్ని బ్లాక్ లో విక్రయిస్తున్నారు. రేషన్ అంటే కేవలం బియ్యం మాత్రమే సరఫరా చేస్తున్నారని, బియ్యం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులకు బియ్యం మాత్రమే సరఫరా చేస్తుందని తెలిపారు.

అవి రైతు భరోసా కేంద్రాలు కావు… రైతు టోకరా కేంద్రాలు

రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలు, రైతులకు టోకరా వేసే కేంద్రాలుగా మారాయని రఘురామకృష్ణంరాజు విమర్శించారు. రైతు తాను పండించిన పంటను అమ్ముకోవడానికి కూడా , రైతు భరోసా కేంద్రాలలోని అధికారి చెప్పిన చోటే అమ్ముకోవలసిన దుస్థితి నెలకొనడం దారుణం. రైతు తన పొలంలో ఏ పంట పండిస్తున్నాడో ముందు రైతు భరోసా కేంద్రాలలో ఈ క్రాప్ చేయించుకోవలసి ఉంటుంది. పంట పండిన తర్వాత, రైతు భరోసా కేంద్రం అధికారి చెప్పిన చోటే పంటను విక్రయించాలి. పోనీ సకాలంలో డబ్బులు చెల్లిస్తారా? అంటే అది లేదు. పంటను విక్రయించిన మూడు నెలల తర్వాత రైతులకు డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ మూడు నెలల పాటు రైతులకు వడ్డీ బొక్క. రైతుకు తన పంటను సొంతంగా అమ్ముకునే స్వేచ్ఛ కూడా రాష్ట్రంలో లేకపోవడం దారుణం అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, రైతులు తాము పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే వెసులుబాటును కల్పించాలని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను రఘురామకృష్ణం రాజు కోరారు. ఈ విధానం దేశవ్యాప్తంగా అమలులో ఉందని, కానీ రాష్ట్రంలో మాత్రమే రైతు భరోసా కేంద్రాల అధికారులు చెప్పిన చోటే విక్రయించాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బు పంపిణీలో ఇన్వాల్వ్ అయితే వాలంటీర్ల ఉద్యోగాలు పోయినట్లే

వాలంటీర్లను రానున్న ప్రభుత్వంలో కూడా కొనసాగిస్తామని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్న నేపథ్యంలో, తమ విధులను వారు సక్రమంగా చేసుకోవాలని రఘురామకృష్ణం రాజు సూచించారు. ఒకవేళ ఎవరైనా వైకాపా నాయకత్వం సూచనల మేరకు డబ్బులు పంపిణీ చేశారో వారి ఉద్యోగాలు పోయినట్టే లెక్కని ఆయన తేల్చి చెప్పారు.